Patnam Mahender Reddy: బీఆర్‌ఎస్‌లో ‘పట్నం’ పంచాయితీ ముగిసిపోలేదా.. ‘పైలెట్’కు లైన్ క్లియర్ చేసేందుకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మంత్రి పదవి ఎరతో మహేందర్‌రెడ్డి సంతృప్తి చెందాలేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. మహేందర్‌రెడ్డి, ఆయన అనుచర వర్గం నుంచి.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పట్నం మహేందర్‌రెడ్డి.. మంత్రి పదవిని అంగీకరించినంత మాత్రాన తాను మెత్తబడినట్లు కాదని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.
తగ్గేదేలే..
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు పట్నం అనుచరులు. పరిస్థితిని బట్టి పోటీ విషయంపై నిర్ణయం తీసుకుంటానని పట్నం కూడా స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ప్రత్యక్ష ఎన్నికలకు ఎలా దూరంగా ఉంటానని ప్రశ్నిస్తున్నారు.
2018లో స్వల్ప తేడాతో ఓటమి..
తెలంగాణలో కేసీఆర్ తొలి క్యాబినెట్‌లో పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. 2014లో తాండూరు నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. 2018లోనూ టీఆర్‌ఎస్ తరఫున తాండూర్ నుంచి బరిలో నిలిచారు. అయితే స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా పట్నంను కాదని పైలెట్‌కే టికెట్ ఇచ్చారు.
మంత్రి పదవితో చల్లపడగొట్టాలని..
టికెట్ రాకపోవడంతో పట్నం పార్టీ మారాతరన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు కూడా జరిపారు. కానీ కేసీఆర్ మరో ఎత్తు వేశారు. పట్నం జారిపోకుండా మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఎర వేశారు. కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో మహేందర్‌రెడ్డి ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకున్నారు. మంత్రి పదవి కోసం తనను నమ్ముకున్న నేతలను కూడా మధ్యలోనే వదిలేశారు.
మాస్ లీడర్‌గా గుర్తింపు..
పట్నం మహేందర్‌రెడ్డి మాస్ లీడర్‌గా తాండూర్ నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది ఆయన అనుచరులు ఊహించ లేరు. మహేందర్‌రెడ్డి కూడా అదే చెబుతున్నారు. మహేందర్‌రెడ్డి మొదట టీడీపీలో ఉండేవారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమ రాజకీయాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్‌రెడ్డిపై గెలిచారు. అయితే మహేందర్‌రెడ్డి ఓడిపోవడంతో మంత్రి పదవి కూడా రాలేదు. ఆయన వస్తానంటే.. బీజేపీ, కాంగ్రెస్ మంచి ప్రాధాన్యత ఇచ్చి చేర్చుకుంటాయనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఏదో ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో మంత్రి మహేందర్‌రెడ్డి ఉన్నట్లుగా ఆయన మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. మంత్రి పదవితో సంతృప్తి పడలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారోనన్న చర్చ మొదలైంది. చివరి దశలో మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ రిస్క్ తీసుకున్నారన్న అభిప్రాయం బీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది.