ఖమ్మం గడ్డ మీద బహిరంగ సభ నిర్వహించిన వైఎస్ షర్మిల.. తెలంగాణ వేదికగా పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ జెండా.. ఎజెండాలను.. పార్టీ పేరును వైఎస్సార్ జయంతి అయిన జూలై 8న ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్న షర్మిల.. మిగిలిన ఈ టైమ్‌లో ఆ వర్క్‌ను పూర్తిస్థాయిలో కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే.. ఖమ్మంలో బహిరంగ నిర్వహించిన షర్మిల ఆద్యంతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీదనే విమర్శలు ఎక్కుపెట్టారు.అంతే కాదు.. తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఆమె సభపై రాజకీయవర్గాలు సైతం ఓ కన్నేశాయి. ప్రజల నుంచి వస్తున్న స్పందనను గ్రహించారు. వీరు అనుకున్నంత స్థాయిలో అక్కడ సీన్ లేకపోవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. షర్మిల సభలో కొంతమంది రాజకీయ నేతలను టార్గెట్ చేసి వ్యక్తగతంగా వ్యాఖ్యలు చేసినా.. ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు.
కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు.. తెలంగాణ సాధించాక వచ్చింది ఏంటంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు.. తన తండ్రి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను కాదని రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం కమీషన్ల కోసమే ఇదంతా చేశారని దుయ్యబట్టారు. అయితే.. సాధారణంగా ఏ పార్టీ నుంచి అయినా అలాంటి విమర్శలకు రివర్స్ అటాక్ ఇచ్చవారు టీఆర్‌ఎస్ నేతలు. దూకుడుగా రిప్లైలు వచ్చేవి. కానీ.. ఆమె వ్యాఖ్యలపై అనవసరంగా స్పందించి.. ఆ పార్టీకి హైప్ తేవాల్సిన అవసరం లేదని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇదే సమాచారాన్ని కిందిస్థాయి లీడర్ల వరకూ పంపించారు. షర్మిల పార్టీ వషయంలో అనవసరంగా ఆవేశపడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలెవరూ నోరు మెదపలేదు. కాంగ్రెస్ కూడా అంతే.. బీజేపీ కూడా సేమ్. అధికారికంగా స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్‌లో వీహెచ్, బీజేపీలో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ మాత్రం స్పందించారు. కానీ.. వాటిని పార్టీ అభిప్రాయాలుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. షర్మిల రాజకీయ అరంగేట్రం మొత్తంగా ఓ ఈవెంట్‌లాగా జరుగుతోందన్న అభిప్రాయ రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. కొత్తగా హైప్ క్రియేట్ చేసి ఆమెకు మైలేజ్ తీసుకురావాల్సిన పనిలేదని నిర్ణయానికి వచ్చారట. సభలో జనం కన్నా వాహనాలే ఎక్కువయ్యాయని అభిప్రాయం కూడా వారిలో కనిపిస్తోంది. అందుకే.. మొదట్లోనే ఆమె పార్టీ ఎలా ఉండబోతోందో అర్థమైపోయిందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఫలితంగా ఎవరి నోట వెంట కూడా షర్మిలను విమర్శిస్తూ వ్యాఖ్యలు వినిపించడం లేదు.