
కరోనావైరస్ తీవ్రతను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమవారం పాక్షిక లాక్‌డౌన్‌ను నెల చివరి వరకు, అంటే మే 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. పాక్షిక లాక్డౌన్ లో రోజుకు 18 గంటలు “కర్ఫ్యూ” ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కఠిననిబంధనలు అమలు అవుతాయి. మే 31తో ఈ పాక్షిక లాక్డౌన్ ఏపీలో ముగుస్తుంది. మే 5 నుండి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్.., ఉన్నత స్థాయి అధికారిక సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19ని నియంత్రించాలంటే ఆశించిన ఫలితాలను పొందాలంటే కర్ఫ్యూ పొడిగింపు అవసరమని అన్నారు. “ఏపీలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయ్యింది. కరోనా కేసులు తగ్గాలంటే కనీసం నాలుగు వారాల వరకు లాక్ డౌన్ అమలులో ఉండాలి” అని జగన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా చూసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
సంక్షోభాన్ని పరిష్కరించడానికి గ్రామ వాలంటీర్లు.. ఆశా కార్మికులు మరియు గ్రామ సచివాలయ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని జగన్ సూచించారు. కోవిడ్ -19 తో తల్లిదండ్రులు మరణించడం వల్ల పిల్లలు అనాథలుగా మారితే, అలాంటి పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్ ఆదేశించారు. అలాంటి అనాథలకు సహాయం చేయడానికి ఆర్థిక పథకాన్ని రూపొందించాలని జగన్ సూచించారు. కొంత మొత్తాన్ని వారి పేరు మీద జమ చేయవచ్చు అని.. అక్కడ నుండి వచ్చే వడ్డీని ప్రతి నెలా వారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని జగన్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలే నెలాఖరు వరకు కొనసాగుతాయని సీఎం జగన్ తెలిపారు. కరోనా ఉధృతితో ఏపీలో 5న కర్ఫ్యూ అమలు చేశారు. ఈనెల 18వ తేదీ వరకు ఉంటుందని ప్రభుత్వం నాలుగో తేదీ వెల్లడించిన విషయం తెలిసిందే.. కోవిడ్ కేసులు తగ్గకపోవడంతో పగటి పూట కర్ఫ్యూను పొడిగించారు.