Amit Shah: సీమాంతర ఉగ్రవాదంతో నష్టపోతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. పక్కలో బల్లెం లాగా తయారైన పాకిస్తాన్ ప్రతిసారి మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఆ దేశంలో ఉన్న ఉగ్ర తాండాల నుంచి తనను తను కాపాడుకునేందుకు భారత్ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ బ్రిటిష్ కాలం నాటి వలసవాద చట్టాలను సమూలంగా మార్చేసే పనిలో పడింది. శుక్రవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ముగింపు సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఇదే సమయంలో భారత అభివృద్ధికి ప్రతి బంధకంగా మారిన ఉగ్రవాదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు.
ఉగ్రవాదం అంటే ఏమిటో కేంద్ర ప్రభుత్వం తొలిసారి నిర్వచించింది. కొత్త బిల్లులో దాని పరిధిని నిర్దేశించింది.” భారతదేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా దేశం బయట లేక లోపల ఉండి ప్రయత్నించే వారంతా ఉగ్రవాదులే. దేశ విచ్చిన్నంలో భాగంగా జన జీవనాన్ని లేక అందులోని ప్రధాన సమూహాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని ఉగ్రవాద చర్యలుగానే పరిగణించాలి. ఉగ్రవాద చర్యలకు పాల్పడినా.. తద్వారా మరణాలు సంభవించినా.. మరణశిక్ష లేదా పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించవచ్చు. పది లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ఉగ్రవాదం నేరం రుజువై యావజ్జీవ శిక్ష పడిన వారి శిక్షాకాలం తగ్గించే అంశాన్ని ఏడేళ్ళ శిక్ష అనుభవించిన తర్వాతే పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నేర చర్యలకు పాల్పడిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా బిల్లులో మార్పులు, చేర్పులు చేసింది.
ఇక మూక హత్యలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్వచనం చెప్పింది.”కులం, భాష, వర్ణం, లింగం, పుట్టిన స్థలం, వ్యక్తిగత విశ్వాసాలతో ఐదుగురికి మించి బృందంగా ఏర్పడి మరొక బృందంపై సాగించే నేర చర్య మూక హత్య పరిధిలోకి వస్తుంది. ఈ నేరానికి గరిష్టంగా మరణశిక్ష, యావజ్జీవ దండన విధించాలి. ఏడు సంవత్సరాల పూర్తి శిక్షను అనుభవించిన తర్వాతే శిక్ష తగ్గింపును పరిశీలించాలి” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐపీసీ లో 511 సెక్షన్ లు ఉన్నాయి. “భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 356 కు కుదించారు. ఇప్పుడు సిఆర్పిసి లో 484 సెక్షన్లు ఉన్నాయి. భారతీయ నాగరికత సురక్ష సంహితలో 533 సెక్షన్లకు పెంచారు. ఎవిడెన్స్ యాక్ట్ లో 167 ఉన్నాయి.. భారతీయ సాక్ష్య లో వాటిని 170 కి పెంచారు. ఐపీసీ లో హత్యా నేరం 302 సెక్షన్, హత్యా యత్నం 307 సెక్షన్, మోసం 420 సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఈ నంబర్లు చెప్పగానే దాదాపు అందరూ నేరాల పేర్లు చెప్పేస్తారు. ఈ సెక్షన్ల పేర్లతో సినిమాలు కూడా వచ్చాయి. అయితే భారతీయ న్యాయ సంహిత లో ఈ సెక్షైలు ఉండవు. ఈ నేరాలను వేరే సెక్షన్ల పరిధిలోకి మార్చారు.