‘కరోనా గురించి ప్రతి ఒక్కరూ అంతగా భయపడాల్సిన అవసరంలేదు. రోజూ మనం ఎన్నో వైరస్‌లకు ప్రభావితం అవుతుంటాం. అయితే వాటి నుంచి కాపాడుకోవడానికి చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవడం, క్రిముల్ని చంపే ద్రవాలతో ఇంట్లో నేలను శుభ్రంగా తుడుచుకోవడం, ముఖాన్ని తరుచూ చేతులతో తడుముకోకుండా ఉంటే సరిపోతుంది’ అని గగన్‌దీప్ తెలిపారు.
‘ఫ్లూ’తో పోలిస్తే కరోనా కొంత తీవ్రమైన వ్యాధి అయినప్పటికీ, ‘సార్స్’ అంతటి ప్రమాదకరమైనది కాదని ఆమె చెప్పారు. పెద్ద వయస్కులు, గుండెజబ్బులతో బాధపడేవారు, బీపీ, డయాబెటిస్ ఉన్నవారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉందన్న గగన్‌దీప్.. శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వీలైనంత తొందరగా వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
నార్వే కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ కొలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నొవేషన్స్ (సిఇపిఐ) వైస్ చైర్‌పర్శన్‌గా ఆమె పనిచేస్తున్నారు. వైరస్ వ్యాక్సినేషన్లను వేగంగా అభివృద్ధి చేయడమే ఈ సంస్థ లక్షం.
కరోనా వైరస్ కన్నా అనేక రకాల ఫ్లూ వైరస్‌లు భారత్‌లో ఉన్నాయని, అయితే ఫ్లూ కన్నా కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. ఇది పిల్లల కన్నా పెద్దలకే ఎక్కువగా సోకుతుందని, గుండె నాళాల సమస్యలు, డయాబెటిస్, రక్తపోటు ఉన్న వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పారు.
ఈ వైరస్‌కు వ్యతిరేకంగా అనేక జౌషధాలను పరీక్షించడమవుతుందని, వచ్చే ఏడాదికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఇవన్నీ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. జ్వరం దగ్గు వస్తే ఇంటి వద్దనే ఉండడం, జ్వరం దగ్గు ఉన్న వారికి ఆరు అడుగులు దూరంగా ఉండడం మంచిదని ఆమె సూచించారు.