https://oktelugu.com/

దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రోజురోజుకు పార్టీలు తమ ఎత్తుగడలు కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తో పొత్తులు తెంచుకుని కొత్త పొత్తుల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బహుజన సమాజ్ పార్టీ జత కట్టేందుకు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 117 అసెంబ్లీ స్తానాలున్న పంజాబ్ లో బీఎస్పీ 20, శిరోమణి అకాలీదళ్ […]

Written By: , Updated On : June 12, 2021 / 08:26 PM IST
Follow us on

దేశంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రోజురోజుకు పార్టీలు తమ ఎత్తుగడలు కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తో పొత్తులు తెంచుకుని కొత్త పొత్తుల కోసం పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బహుజన సమాజ్ పార్టీ జత కట్టేందుకు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 117 అసెంబ్లీ స్తానాలున్న పంజాబ్ లో బీఎస్పీ 20, శిరోమణి అకాలీదళ్ 97 సీట్లలో పోటీ చేస్తాయని తెలిపారు.

పంజాబ్ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మకమైన రోజు అని బీఎస్పీ జనరల్ సెక్రటరీ సతీశ్ చంద్ర తెలిపారు. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తు పంజాబ్ రాజకీయాలను మలుపు తిప్పుతాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయనున్నారు. 1996 లోక్ సభ ఎన్నికల తర్వాత శిరోమణి అకాలీదళ్, బీఎస్పీలు జత కట్టడం ఇదే మొదటిసారి. అప్పటి ఎన్నికల్లో రెండు పార్టీలు బరిలో దిగగా 13 లోక్ సభ స్థానాలకుగాను 11 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో అకాలీదళ్ 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ3 స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో విజయం సాధించింది.

గత 23 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ బీజేపీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలో కొనసాగిన సంగతి తెలిసిందే. గతేడాది కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్టీయే నుంచి ఆ పార్టీ తప్పుకుంది. మొదట ఆ పార్టీకి చెందిన ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలిగింది. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించిన గత వారమే సుఖ్ బీర్ సింగ్ బాదల్ హింట్ ఇచ్చారు.

పంజాబ్ లో దళితుల జనాభా దాదాపు 40 శాతంగా ఉంది. దోబా ప్రాంతంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితుల ఓటు బ్యాంకే ప్రధానంగా ఉంది. దీంతో బీఎస్పీతో పొత్తు తమకు కలిసొస్తుందని శిరోమణి అకాలీదళ్ భావిస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ బీజేపీ పొత్తులతో బరిలో దిగగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో అమ్ ఆద్మీ 20 స్థానాల్లో గెలుపొందింది. శిరోమణి అకాలీదళ్ 94 స్థానాల్లో కేవలం 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.