
ఏపీలో ఎన్నికల విషయంలో సర్కార్ వర్సెస్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అన్నట్లు యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వీడియో చిత్రీకరణ చేయాలని గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు ఎస్‌ఈసీ ఆదేశాలను సమర్ధించింది.
Also Read: తెలంగాణ పుట్టినిల్లు.. మెట్టునిల్లు : ఇదే షర్మిల స్లోగన్
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు ఎస్ఈసీకి పలు ఫిర్యాదులు చేశాయి. తొలి రెండు దశల పంచాయతీ పోరులో అధికార పార్టీ కౌంటింగ్‌ను కూడా ప్రభావితం చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ బూత్‌లో ఓట్ల లెక్కింపును వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రంలో అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ చేయాలంటే సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయని, అందుకే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం వీడియో చిత్రీకరణ చేస్తామని హైకోర్టుకు చెప్పింది. అయితే.. సమస్యాత్మక ప్రాంతాలను ఎలా గుర్తిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సరైన సమాధానం లేకపోవడంతో హైకోర్టు ఇవాళ ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయాలని తీర్పునిచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ నిష్పాక్షికంగా జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఇందులో ఓ మినహాయింపు మాత్రం ఇచ్చింది. పంచాయతీలో ఉండే ఓటరు ఎవరైనా కోరితే వెంటనే కౌంటింగ్‌ను చిత్రీకరించాలని ఆదేశాలు ఇచ్చింది.
Also Read: వర్షాలపై నా మాటలు వక్రీకరించారు: మేయర్ విజయలక్ష్మి
ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపునకు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించింది. ఇరువురి వాదనలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Comments are closed.