Pakistan’s economic crisis : ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇంధన రంగ సమస్యలు, ఆర్థిక అసమతుల్యత, బాహ్య ఆర్థిక సహాయంపై అధికంగా ఆధారపడటం వంటి ఎన్నో సమస్యలతో పోరాడుతోంది మన పొరుగు దేశం పాకిస్తాన్. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ వైమానిక దళం (PAF) చైనా నుంచి 40 J-35 జెట్‌లను కొనుగోలు చేయడానికి ఆమోదించినట్లు నివేదించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, డెలివరీలు రెండేళ్లలో జరుగుతాయట. కానీ పాకిస్తానీ ప్రభుత్వం తన ప్రపంచ ప్రతిష్టను దెబ్బతీసే కొత్త సవాలును ఎదుర్కొంటోందని మీకు తెలుసా?
అంతకు ముందు నవంబర్ 2024లో, సౌదీ అరేబియా హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖను మతపరమైన తీర్థయాత్రల ముసుగులో రాజ్యంలోకి ప్రవేశించే పాకిస్తానీ బెగ్గర్స్ సమస్యను పరిష్కరించాలని కోరింది. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, ఉమ్రా వీసాలపై సౌదీ అరేబియాకు వెళ్లి భిక్షాటన కార్యకలాపాల్లో నిమగ్నమైన పాకిస్థానీల సంఖ్య పెరుగుతోందని సౌదీ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు మత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వర్గాలు నివేదించాయి. ఈ సమస్య కొనసాగితే, ఉమ్రా, హజ్ చేపట్టే పాకిస్తానీ యాత్రికుల కీర్తి, భవిష్యత్తు ఏర్పాట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం మరింత దిగజారుతుంది. అయితే పాకిస్తాన్‌లోని 230 మిలియన్ల జనాభాలో ఎంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఏప్రిల్ 26, 2024న డాన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, పాకిస్తాన్ 230 మిలియన్ల జనాభాలో 38 మిలియన్ల మంది బిచ్చగాళ్ళు ఉన్నట్లు అంచనా వేసింది. జాతీయ సగటు రోజువారీ ఆదాయం ప్రకారం యాచకులు రూ. 850 సంపాదిస్తున్నారట. కరాచీలో, ఒక బిచ్చగాడు సగటున 2,000 సంపాదిస్తాడు అని ఆ నివేదిక తెలిపింది. ఇక లాహోర్‌లో ఈ మొత్తం 1,400 రూపాయలు వస్తుంది. అటు ఇస్లామాబాద్‌లో 950 రూపాయల వరకు సంపాదిస్తున్నారట. దేశవ్యాప్తంగా యాచకులు సగటున రోజుకు 850 రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు దాదాపు ఏకంగా నెలకు 20 వేల నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నారు అన్నమాట.
మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని యాచకులు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రతిరోజూ రూ. 32 బిలియన్లు వసూలు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ మొత్తం సంవత్సరానికి రూ. 117 ట్రిలియన్లు, ఇది $42 బిలియన్లకు సమానం. వీరు 38 మిలియన్ల ఉత్పత్తి చేయని వ్యక్తులు. కానీ ఏకంగా $42 బిలియన్లను వినియోగిస్తున్నారు. దీని వల్ల మిగిలిన దేశం కూడా 21 శాతం ద్రవ్యోల్బణంతో భరించవలసి వస్తుంది అని డాన్ నివేదించింది.