
అదేంటీ? అమెరికాను బెదిరించేంత సీన్ పాకిస్తాన్ కు ఉందా? అనే డౌట్ రావొచ్చు. కానీ.. కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు మరి. బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి. అంటే.. పాకిస్తాన్ బండి ఓడ అయ్యిందా? అంటే.. అంత సీన్ లేదు. మరి, అగ్రరాజ్యాన్ని బెదిరించడమేంటీ? అసలు ఏం జరుగుతోంది? అన్నది తెలియాలంటే.. ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
ట్రంప్ ముందు వరకు అమెరికా – పాక్ మధ్య బంధం ఎలా ఉండేదో.. అంతర్జాతీయ రాజకీయాలను చూచాయగా పరిశీలించిన వారికి కూడా అర్థమైపోతుంది. ఇటు భారత్ తో ఎంతగా స్నేహ సంబంధాలు కొనసాగించేదో.. అటు పాక్ తోనూ అదేవిధంగా రాసుకుపూసుకు తిరిగేది. అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తే.. పాకిస్తాన్ ఆతిథ్యం స్వీకరించిన తర్వాతగానీ తిరిగి వైట్ హౌస్ కు చేరుకునేవాడు కాదు. కశ్మీర్ అంశానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ.. రెండు దేశాలతోనూ రాజకీయాలు నెరపేది అమెరికా.
కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాతో బంధాలు చాలా వరకు తగ్గిపోయాయి. పలు కారణాలు చూపుతూ పాక్ ను దూరం పెట్టారు మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. మర్యాదపూర్వకంగా కనీసం ఫోన్ చేసి, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పలకరించలేదు బైడెన్. అదే సమయంలో.. భారత ప్రధాని మోడీకి మాత్రం ఫోన్ చేశారు. ఈ పరిణామాలతో అమెరికాపై గుర్రుగా ఉన్నారు పాక్ ప్రధాని.
గతంలో పాక్-అమెరికా మధ్య సంబంధాలు ఎంతో బాగుండేవని, అమెరికా అధ్యక్షులు పాకిస్తాన్ కు అన్ని విధాలా అండగా నిలిచేవని గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. పాక్ జాతీయ భద్రతా సలహాదారులు మోయిన్ యూసఫ్.. లండన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పడం గమనార్హం. గతంలో అమెరికా అధ్యక్షుడు పాక్ అధినేతలతో అధికారిక నివాసంలో భేటీ అయిన విషయాలను కూడా ఆయన గుర్తు చేశారు.
ఇలాంటి అంశాలను ప్రస్తావించిన ఆయన.. అమెరికా తమను వద్దనుకుంటే.. తమకు ప్రత్యామ్నాయాలు లేకపోలేదని ప్రకటించడం గమనించాల్సిన అంశం. అంటే.. పరోక్షంగా తమకు చైనా అండ ఉందని చెప్పుకున్నారన్నమాట. కొంత కాలంగా చైనా ఆర్థికంగా ఏ విధంగా ఎదుగుతోందో తెలిసిందే. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న చైనా.. అమెరికాను దాటేయాలనే తలంపుతో పనిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ప్రత్యామ్నాయం ఉందని పాక్ చెప్పడమంటే.. మీరు వద్దంటే వెళ్లి చైనానుకు కౌగిలించుకుంటామని హెచ్చరిక జారీచేయడమన్నమాట.
కొంత కాలంగా.. పాకిస్తాన్-చైనా బంధం ఏ స్థాయిలో పెరుగుతోందో తెలిసిందే. పలు విషయాల్లో సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతున్నాయి. ఆ విధంగా ఈ రెండు దేశాలు మరింత దగ్గరయ్యాయి. చైనాలో ముస్లింలను అణచి వేస్తున్నప్పటికీ పాకిస్తాన్ కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే.. అమెరికాపై ఒకింత హెచ్చరికలాంటి వ్యాఖ్యలు చేసింది పాక్. మరి, భవిష్యత్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.