
Padma Awards 2021: దేశంలో పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రతీ సంవత్సరం ఇచ్చే “పద్మ” పురస్కారాల ప్రదానం ఢిల్లీలో అట్టహాసంగా సాగింది. 2021 సంవత్సరానికి గానూ ప్రకటించిన ఈ అవార్డులను రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం 7 పద్మవిభూషణ్‌లు, 10 పద్మభూషణ్‌లు, 102 పద్మశ్రీ అవార్డులను అందజేశారు. అయితే.. వీరిలో సామాన్యులుగా కనిపించే అసామాన్యులు కూడా ఉన్నారు. వారెవరన్నది చూద్దాం.

మాత బీ మంజమ్మ జోగతి : ఈమె కళారంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కర్ణాటక జానపద అకాడమీ చైర్మన్ గా ఉన్న ఈమె.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జానపద కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. కళారంగంలో మంజమ్మ చేసిన కృషికి గానూ.. పద్మ అవార్డు దక్కింది.

రంగమ్మాళ్ : ఈమెను పప్పమ్మాళ్ అనికూడా అంటారు. రంగమ్మాళ్ వ్యవసాయ విభాగంలో పద్మశ్రీ పురస్కరం అందుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మహిళారైతుగా అద్భుతాలు సృష్టించారు.ఎరువు, మొక్కల వ్యర్థాల వంటి సేంద్రి ఎరువులను వ్యవసాయ అవసరాలకు వినియోగించాలని ఈమె ప్రచారం చేస్తున్నారు.

తులసి గౌడ : సమాజ సేవలో నేను సైతం అంటూ ఈమె చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆమె కర్ణాటకకు చెందిన పర్యావరణ కార్యకర్త. ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఈమె.. దాదాపు 30 వేలకు పైగా మొక్కలు నాటారు.

నందప్రస్తి : విద్య, సాహిత్యం విభాగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఒడిశాలోని జాజ్‌పూర్‌లో.. పిల్లలకు, పెద్దలకు దశాబ్దాల తరబడి ఉచిత విద్యను అందించారు. ప్రస్తుతం నందప్రస్తి వయసు.. 102 ఏళ్లు! వారు చేసిన సేవకుగానూ.. పద్మ అవార్డు వరించింది.

చలపతిరావు : కళల విభాగంలో పద్మశ్రీ దక్కింది. ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో షాడో పప్పెట్ క్రాఫ్ట్ లెదర్ తోలుబొమ్మలాటలో ప్రసిద్ధ కళాకారుడిగా పేరుగాంచారు. అంతరించిపోతున్న కళకు దశాబ్దాలుగా ఈయన ప్రాణం పోస్తున్నారు.

కేవై వెంకటేష్ : ఈయన క్రీడా విభాగంలో పద్మశ్రీ అందుకున్నారు. పుట్టుకతోనే దివ్యాంగులైన వెంకటేష్.. జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. వాటిని అధిగమించారు. వివిధ క్రీడల్లో విజేతగా నిలిచి సత్తా చాటారు. 2009లో జరిగిన 5వ వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ కు నాయకత్వం వహించారు.

చుల్తిమ్ చోంజోర్ : ఈయన కూడా సామాజిక సేవలో అవార్డు అందుకున్నారు. లడఖ్‌కు చెందిన ఈ సామాజిక కార్యకర్త.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. లడఖ్‌లోని రామ్‌జాక్ నుంచి కర్గాక్ గ్రామం వరకు దాదాపు 40 కిలో మీటర్ల మేర ఎన్‌పీడీ రహదారిని నిర్మించారు.

మైత్యరామ్ రియాంగ్ : ఈయన కూడా కళ విభాగంలోనే పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. త్రిపురకు చెందిన ఈ జానపద కళాకారుడు.. హోజాగిరి నృత్యం, బ్రూ జానపద పాటలకు గుర్తింపు తెచ్చారు. ఈ కళలో మైత్యరామ్ రియాంగ్ చేసిన కృషి ఎంతో ప్రసిద్ధి చెందింది.

సింధుతాయ్ సప్కల్ : సామాజిక సేవ విభాగంలోనే ఈమె పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ సామాజిక కార్యకర్త.. తన జీవితాన్ని పేదలు, వారి అవసరాలు తీర్చడానికే అంకితం చేశారు. ఆమె 45 సంవత్సరాల్లో.. 1500 మందికి పైగా అనాథలను ఆదుకున్నారు.

కమలీ సోరెన్ : సామాజిక సేవ విభాగంలోనే ఈమె కూడా పద్మ అవార్డు అందుకున్నారు. ఈమె భారతీయ సనాతన సంతాల్ కళ్యాణ్ ఆశ్రమ స్థాపకురాలు. బెంగాల్‌లోని సంతాల్ లో అణగారిన ప్రజల అభ్యున్నతికోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఈమె సేవకు గానూ పద్మ అవార్డు దక్కింది.