Revanth Reddy: తెలంగాణ వరి ధాన్యం కిరికిరి కేంద్రానికి చేరింది. టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రంలోని బీజేపీ అన్నట్లు ఫైట్ సాగింది. అయితే, అది ఉట్టుట్టి ఫైటేనని, బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆరోపించారు. టీఆర్ఎస్ మాత్రం తాము రైతుల కోసమే పోరాడుతున్నామని చెప్తోంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిరసనలూ తెలిపింది. చివరకు మాత్రం తాము పార్లమెంటులో అడుగు పెట్టబోమని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. అయితే, టీఆర్ఎస్ ఎంపీలు అలా చేయబోతున్నారనే విషయాన్ని ఎంపీ రేవంత్‌రెడ్డి ముందే చెప్పడం గమనార్హం. ఇంతకీ రేవంత్ ఏం చెప్పారు., టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారు., అనే విషయాలపై ఫోకస్..
తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలూ డ్రామాలు చేస్తున్నాయని కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఈ విషయమై వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎంపీలు రైతుల పక్షాన పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీతో లాలూచీ పడ్డారని, టీఆర్ఎస్ డ్రామా ముగిసిందని రేవంత్ ఆరోపించారు. రేవంత్ అన్నట్లుగానే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక పార్లమెంటులో అడుగు పెట్టబోమని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు తెలిపారు. కేంద్రం మోస పూరిత వైఖరిని రాష్ట్రంలో ఎండగడుతామని టీఆర్ఎస్ ఎంపీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రేవంత్ ఆరోపించినట్లుగానే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటును బహిష్కరించడం వెనుక బీజేపీతో రహస్య ఒప్పందం ఉందా? అనే ప్రశ్న ఎదురవుతున్నది. అయితే, రేవంత్ ఆరోపణల్లో ఇంకో అంశం కూడా ఉంది. అదేంటంటే..ఓ భూ కుంభకోణంలో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీతో డీల్ కుదుర్చుకున్నారని, అందులో రూ.3 వేల కోట్ల స్కాం ఉందని రేవంత్ బాంబు పేల్చారు.
Also Read: Army Helicopter: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!
అయితే, రేవంత్ ఆరోపణలు ఉట్టివేనని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కానీ, ఎక్కడో అంతుచిక్కని విషయం ఉందనే చర్చ అయితే ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలు నిజం చేసే విషయంలో మాత్రం అడుగులు పడలేదు. టీఆర్ఎస్ ఏం చేయబోతున్నదనే విషయం రేవంత్ ముందే చెప్పిన నేపథ్యం, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు అలానే చేయడం ద్వారా రాజకీయ వర్గాలు ఈ విషయమై చర్చించుకుంటున్నాయి. చూడాలి మరి.. ఇందులో ఎంత నిజముందో..
Also Read: Harish Rao: ‘హరీష్’కు పెరిగిన ప్రాధాన్యం.. వ్యూహమేనా?