https://oktelugu.com/

Uttar Predesh : దావత్ కు పిలిచి మటన్ ముక్కలు వేయలేదు.. బోటి కూర వడ్డించలేదు.. ఏకంగా స్టేట్ రాజకీయాలే షేక్ అవుతున్నాయి..

ఇటీవల మటన్ కోసం జరుగుతున్న గొడవలను మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లిళ్లలో తమ వారికి మటన్ ముక్కలు వేయలేదని.. కోరినంత బోటి వడ్డించలేదని పరస్పరం దాడులు చేసుకున్న సంఘటనల గురించి మనం అనేకం చదివాం. చదువుతూనే ఉన్నాం. అయితే మటన్ వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు కామన్.. మటన్ వల్ల ఇప్పుడు దేశంలో ఏకంగా ఒక స్టేట్ రాజకీయాలే షేక్ అవుతున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 18, 2024 9:40 pm
Akhilesh Yadav

Akhilesh Yadav

Follow us on

Uttar Predesh :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఇటీవల తన కార్యకర్తలకు విందు ఇచ్చాడు.. ఆ విందుకు ముందు కొద్దిరోజులుగా భారీగా ప్రచారం చేశాడు. దీంతో కార్యకర్తలు విశేషంగా తరలివచ్చారు. వచ్చిన వారందరికీ భారీగానే వంటలు తయారు చేశారు. మటన్ కూర, బోటి కూర, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యాని, తలకాయ పులుసు వంటి వంటకాలు వండారు. అయితే కార్యకర్తలు పిలిచిన దానికంటే ఎక్కువ రావడంతో వండిన వంటలు నిండుకున్నాయి. అప్పటికప్పుడు వంటకాలు సిద్ధం చేయాలనుకున్నప్పటికీ.. బయట మటన్ లభించలేదు. వేరే ప్రాంతం నుంచి పొట్టేళ్లను తీసుకొచ్చి వధించాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో ఆ కాస్త వంటలతోనే మిగతా వారికి సరిపుచ్చారు. మొదట్లో తిన్నవాళ్లకు ముక్కలు భారీగానే వేశారు. కానీ మరుసటి వారికి పులుసుతోనే సరి పెట్టారు. దీంతో కార్యకర్తలు వడ్డించే వారితో గొడవపడ్డారు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వివాదంగా మారింది. అధికార బీజేపీని ఎప్పుడెప్పుడు విమర్శించాలా అని ఎదురుచూసే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు సరైన అస్త్రం లభించినట్టు అయింది. దీంతో ఆయన అధికార బిజెపిపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో మటన్ వివాదం దేశం మొత్తం తెలిసింది.

అందుకోసమే మటన్ వడ్డించారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాది పార్టీకి చెందిన వినోద్ కుమార్ అనే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం ఇస్తున్న మజవాన్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. నవంబర్ 20న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానంలో గెలవడానికి సమాజ్వాది పార్టీ, బిజెపి హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కార్యకర్తలకు విందు ఇచ్చాడు. ఆ విందు కాస్త వివాదానికి కారణమైంది. అయితే ఇదే విషయాన్ని ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ప్రస్తావించారు. ” మటన్ కోసం యుద్ధం జరిగిందని ఇప్పుడే చూస్తున్నాను. కార్యకర్తలను విందుకు పిలిచి ఇలా చేస్తానని నేను ఊహించలేదు. చివరికి బోటి కూర కూడా పెట్టలేదట. కార్యకర్తలకు కడుపునిండా అన్నం పెట్టని వారు.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు.. ఇలాంటి ఘటనలు ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు.. బహుశా ఇలాంటి వాటికి శ్రీకారం చుడుతున్న వారిని ఎలా విమర్శించాలో అర్థం కావడం లేదు. కార్యకర్తలంటే వారి దృష్టిలో పెద్ద గౌరవం ఉండదు. ఎన్నికల సమయంలో మాత్రమే విందులు ఇస్తుంటారు. అవి కూడా అంతంత మాత్రమే.. ఇలాంటి విషయాలను కార్యకర్తలు గుర్తించాలి. తమకు విలువ ఇవ్వని వారి కోసం ఎందుకు విలువైన ఓటు వేయాలని” అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. అయితే మటన్ వివాదం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. ఈ మటన్ వివాదంపై జాతీయ మీడియా ఏకంగా డిబేట్లు నిర్వహిస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.