Ramoji Film City : రామోజీ ఫిలిం సిటీ.. సినీ నిర్మాణాలకు సంబంధించి ప్రపంచంలోనే పేరెన్నిక గలది. అటువంటి ఈ రామోజీ ఫిలిం సిటీపై మొదటి నుంచి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫిలిం సిటీపై అనేక రకాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు అప్పట్లో ఈనాడుకు పోటీగా సాక్షి పత్రికను వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినప్పుడు.. రామోజీరావు కంపెనీలకు సంబంధించి చాలా విశ్లేషణాత్మక కథనాలు తన పత్రికలో రాయించేవారు. అయితే వైయస్ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన గోనె ప్రకాష్ రావు రామోజీ ఫిలిం సిటీ కి సంబంధించి కీలక ఆరోపణలు చేసేవారు. అసైన్డ్ భూములు ఆక్రమించారని, వాటన్నింటిపై చర్యలు తీసుకోవాలని కోరేవారు. వైయస్ చనిపోవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో రామోజీ ఫిలిం సిటీ భూముల భాగోతం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్ళతో దున్నిస్తానని కేసీఆర్ పదేపదే అన్నారు. తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు గోనె ప్రకాష్ రావు మరోసారి తెరపైకి వచ్చారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రకాష్ రావు విలేకరులతో మాట్లాడారు. ఫిలిం సిటీ లోని 3 ఎకరాల భూముల్లో 17 ఎకరాలు గాలిబ్ జంగ్ కు చెందినవని ఆయన బాంబు పేల్చారు. అంతేకాదు ప్రజా రహదారులు, ఎస్సీ ల్యాండ్స్, భూ దాన్ భూములను సైతం ఆక్రమించారని ఆరోపించారు. చివరికి అనాజ్ పూర్_ఇబ్రహీం పట్నం రహదారిని కూడా ఆక్రమించారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో 632 మందికి 200 గజాల చొప్పున పట్టాలు ఇవ్వగా.. వారిని ఆ స్థలాల్లోకి కూడా రానివ్వడం లేదని ప్రకాష్ రావు ఆరోపించారు. అంతేకాదు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టం ప్రకారం నోటీసులపై రామోజీరావు కోర్టుకు వెళ్లడానికి వీలులేదని.. ఇది చాలా పటిష్టమైన చట్టం అని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ హయాంలోనే కోర్ట్ ఆఫ్ వార్ట్స్ చట్టం తీసుకువచ్చారని.. దేశవ్యాప్తంగా వివిధ రాజవంశాల చెందిన 560 మందిని అందులో చేర్చారన్నారు. నిజాం హయాంలోనూ ఇలాంటి మార్వాడి, ముస్లిం కుటుంబాలు 8 దాకా ఉన్నాయని గోనె ప్రకాష్ రావు గుర్తు చేశారు. ఆ రాజ వంశీలకు చెందిన లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని.. ఈ విషయంలో తాను చేస్తున్న పోరాటం చివరి వరకు చేరుకుందని ప్రకాష్ రావు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజ వంశీయులకు చెందిన భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని.. అందులో ఈనాడు గ్రూప్స్ యాజమాని రామోజీరావు తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నిర్మాణ సంస్థగా ఉన్న మై హోమ్ కంపెనీ ఆధీనంలో ఉన్నాయని ప్రకాష్ రావు ఆరోపించారు. ఆ భూములలో భారీ భగవంతుడు నిర్మించారని.. వీరే కాకుండా అమెరికాలో బడా పారిశ్రామికవేత్త కు చెందిన స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయని.. తాజ్ గ్రూప్ కు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ భూములు కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పరిధిలోనివని గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. అయితే ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంచలనం నెలకొంది. అయితే ఈ భూములపై రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.