Oruganti Srinivas Rajasthan CS: మనదేశంలో అతిపెద్ద రాష్ట్రాలలో రాజస్థాన్ ముందు వరుసలో ఉంటుంది. అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న రాజస్థాన్లో కొంత ప్రాంతం ఎడారిగాను.. మరికొంత ప్రాంతం దట్టమైన అడవులతో.. ఇంకొంత ప్రాంతం శీతల గాలులకు ఆలవాలంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చెరకు, పత్తి, ఆవాల పంటలు పండుతుంటాయి.. ఎడారి ప్రాంతాలలో ప్రజలు మేకలు, గొర్రెలు, పశువులను సాకుతూ జీవిస్తుంటారు..
రాజస్థాన్ పెద్ద రాష్ట్రం కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం వివిధ దశలలో అధికారులను నియమించింది. వారంతా పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు.. గతంలో రాజస్థాన్ రాష్ట్రంలో తెలుగు అధికారులు పనిచేశారు. అక్కడ విప్లవాత్మక విధానాలను అమలుచేసి శభాష్ అని పెంచుకున్నారు.. రాజస్థాన్ రాష్ట్రంలో కరువును సాధ్యమైనంతవరకు దూరం చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందారు. అంతటి పెద్ద రాష్ట్రానికి ఇప్పుడు తెలుగు వ్యక్తి చీఫ్ సెక్రటరీ కాబోతున్నారు.. అంతేకాదు అక్కడి అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు మొత్తం పర్యవేక్షించబోతున్నారు.
రాజస్థాన్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువాడు ఓరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర సర్వీస్ లలో ఈయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పనితీరుకు మెచ్చి రాజస్థాన్ ప్రభుత్వం డిప్యూటేషన్ మీద రప్పించింది. ఆయనకు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించింది. అరకు లోయలో 1966లో శ్రీనివాస్ జన్మించారు. భద్రాచలంలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1989లో ఎంటెక్ పూర్తి చేసి సివిల్స్ రాశారు. మెరుగైన ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. పీవీ నరసింహారావు మనవరాలు శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ఆయన కేంద్ర సర్వీస్ లలో పనిచేస్తున్నారు. వివాదాహితుడు, అవినీతికి దూరంగా ఉండే అధికారి కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈయనను డిప్యూటేషన్ మీద చీఫ్ సెక్రటరీగా నియమించింది.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో శ్రీనివాస్ గొప్పగా పని చేశారు. అందువల్లే రాజస్థాన్ ప్రభుత్వం ఈయన మీద దృష్టి సారించింది. ట్రాక్ రికార్డు కూడా గొప్పగా ఉండడంతో ఆయనను చీఫ్ సెక్రటరీగా నియమించింది. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాస్ చీఫ్ సెక్రటరీగా నియామాకం కావడం పట్ల అరకులోయ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.