Opposition Unity: లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం ఉన్న నేపథ్యంలో దేశం లోని ప్రతిపక్షాలు అప్పుడే రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.. గెలుపే లక్ష్యంగా, పాలక, ప్రతిపక్ష కూటములు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు సంఘటితమవుతున్నాయి. సోమవారం నిర్వహించిన సమావేశంలో కొత్త కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి.. బెంగళూరులో సమావేశమైన 26 విపక్ష పార్టీలు మంగళవారం కూటమి పేరు, దానికి సారథ్యం వహించే వ్యక్తి, పొత్తులు ఇతర అంశాలపై చర్చించనున్నాయి.. కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, బీహార్, ఢిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, వామపక్ష నేతలు ఏచూరి, డి. రాజా, బెంగళూరు లో నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు. మరోవైపు 2024 లోనూ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని మోడీ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్వహిస్తోంది. దీనికి 38 పార్టీలు హాజరవుతున్నాయి. ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా వాటిని బలహీనపరిచి.. సాధ్యమైనంతవరకు ఎక్కువ పార్టీలను చేర్చుకొని మూడవసారి విజయం సాధించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు. శివసేన,ఎన్సీపీ లను కూడా ఇలాగే చీల్చారు. చీలిక వర్గం నేతలైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ భేటీకి హాజరవుతున్నారు.
20 లక్షల మంది తో ర్యాలీ
మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి నితీష్ కుమార్ కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో పాట్నాలో జరిపిన భేటీ విజయవంతమైంది. బెంగళూరులో సోమవారం జరిపిన సమావేశం కూడా దాదాపుగా విజయవంతమైంది. ఇక మంగళవారం నిర్వహించే సమావేశంలో విపక్ష కూటమికి నేతృత్వం వహించే సారధిని ఎన్నుకుంటారు. దీని తర్వాత దాదాపు 20 లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించాలని విపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. దీనిపై మంగళవారం జరిగే భేటీలో తుది నిర్ణయం తెలుస్తోంది. ఇక బెంగళూరు తరలి వచ్చిన 26 విపక్ష పార్టీల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. సోమవారం రాత్రి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో విందు ఇచ్చారు. ” మేమంతా ఐక్యంగా ఉన్నాం” అనే బ్యానర్ ప్రదర్శించారు. ఈ విందులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, పక్కనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూర్చున్నారు..ఖర్గే, రాహుల్ గాంధీ, తమిళ నాడు, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్య మంత్రులు స్టాలిన్ (డీఎంకే), నితీష్ కుమార్ (జెడియు), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), హేమంత్ సోరెన్(జే ఎంఎం), లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (ఆర్ జె డి), సీతారాం ఏచూరి (సిపిఎం), రాజా (సిపిఐ), ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి(పిడిపి), అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాదీ), జయంత్ చౌదరి ( ఆర్ఎల్డి), తదితరులు హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక్కరే రాలేదు. ఆయన తన కుమార్తె సుప్రియ సులేతో కలిసి మంగళవారం వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
ఏం చర్చించారంటే
విపక్ష పార్టీల భేటీ సందర్భంగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, గవర్నర్ల ద్వారా సమాఖ్య వ్యవస్థకు తూట్లు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు సహాయ నిరాకరణ, ప్రతిపక్షాలను చీల్చడం, మణిపూర్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వీటి అన్నింటిపై పోరుబాట పట్టాలని విపక్ష పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని తెలుస్తోంది. ఉమ్మడి కనీస కార్యక్రమం రూపకల్పనకు, ఉమ్మడి ప్రచారానికి మంగళవారం నాటి భేటీలో వేరువేరుగా సబ్ కమిటీలు నియమించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు, ఈవీఎంలో లోపాల పైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇక కొత్త కూటమికి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేసే దిశగా విపక్ష పార్టీల సభ్యులు అడుగులు వేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలు దాకా కీలక సమావేశం నిర్వహిస్తామని విపక్ష పార్టీల సభ్యులు చెబుతున్నారు.
రోడ్డు మ్యాప్ సిద్ధం చేశాం
ఇక ఈ భేటీ అనంతరం కొంతమంది విపక్ష సభ్యులు విలేకరులతో ఇష్టాగోష్టి గా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకే ఆమె కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. బెంగళూరు సమావేశం ఒక గేమ్ చేంజర్ అవుతుందని వారు ప్రకటించారు. పాట్నాలో జరిగిన భేటీకి 15 పార్టీల అధినేతలు రాగా… ఆ సంఖ్య 26 పార్టీలకు చేరుకుందని వారు చెప్తున్నారు. లోక్ సభ ఎన్నికలపై చర్చిస్తామని, సోనియా గాంధీ కూడా పాల్గొంటుండడంతో మరింత శక్తి వస్తుందని ప్రకటించారు. కూటమికి పేరుతో పాటు సారథ్యం ఎవరు వహిస్తానన్నది కూడా చర్చకు వస్తుందని ప్రకటించారు. ఇవన్నీ కూడా ఒక్కరోజులోనే నిర్ణయమైయిపోవని, ఇంకా ఒకటి రెండు సమావేశాలు జరుగుతాయని వారు వివరించారు. రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రకటించారు.