తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇన్నాళ్లు ఎదురు లేకుండా పోయిన టీఆర్ఎస్ కు ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, షర్మిల ఒక్కొక్కరుగా రాష్ర్టంలో తమ ప్రాబల్యం నిరూపించుకునే క్రమంలో దూసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు మింగుడుపడడం లేదు. ఎన్నికల్లో ఎలా గెలవాలని భావిస్తోంది. గతంలో ఎక్కడ కూడా పోటీ లేకుండా పోవడంతో విజయం నల్లేరుపై నడకలా మారింది. ప్రస్తుతం అన్ని పార్టీలు పోటీకి సై అంటుండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయింది.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పోటీ లేకుండా పోయింది. దీంతో విజయం సునాయాసంగా దక్కింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో తిరుగులేని పార్టీగా ఎదిగింది. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో షాక్ కు గురైన పార్టీ చక్కదిద్దే పనిలో పడింది. దీంతో ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పుంజుకుంది. మళ్లీ విజయం సాధించింది.
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం అంత సునాయాసంగా రాదనే తెలుస్తోంది. అధికారపార్టీ భూకబ్జా ఆరోపణలతో మంత్రి ఈటల రాజేందర్ ను తొలగించడంతో ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీకి సిద్ధమయ్యారు. సొంత నియోజకవర్గం కావడంతో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయడం పార్టీలకు కష్టంగానే మారింది. ఆయన ఇప్పటికే పలు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ గెలిపించాలని కోరుతూ తిరుగుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన దూకుడు పెంచింది. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక స్పీడు పెంచారు. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు తనదైన దారిలో నడుస్తున్నారు. అధికార పార్టీని ఎలాగైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ముందుకు కదులుతున్నారు. ఇంకోవైపు వైఎస్ షర్మిల తన ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నడుం బిగించారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు పావులు కదుపుతున్నారు.