
ప్రభుత్వం చేసిన, చేస్తున్న తప్పులను విపక్షాలు నిగ్గదీసే సమయం, సందర్భం చట్ట సభలే. ప్రస్తుతం దేశంలో పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో అగ్గిరాజుకుంటుందని, బ్రహ్మాండం బద్దలైపోతుందనే అంచనాలు వచ్చాయి. అయితే.. సభలు కొనసాగుతున్న తీరు అందుకు విరుద్ధంగా ఉంది. నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ.. సరైన రీతిలో సర్కారును నిలదీసే అవకాశాన్ని విపక్షాలు వినియోగించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశాన్ని కరోనా మహమ్మారి ఎంతగా నాశనం చేసిందో అందరికీ తెలిసిందే. వేలాది మంది ప్రాణాలు కోల్పోతే.. కోటి మందికిపైగా ఈ మహమ్మారి బారిన పడి జీవితాలను ఛిద్రం చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థమొత్తం చిన్నాభిన్నమైపోయింది. ఒక సర్వే ప్రకారం.. దేశ ప్రజలు కరోనా మీద చేసిన ఖర్చు ఏకంగా 64,000 లక్షల కోట్లు. పరిస్థితి ఇంత దారుణంగా తయారవడానికి కేంద్రంలోని బీజేపీనే కారణమని దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే తగిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలపై దృష్టిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కేబినెట్ మొత్తం బెంగాల్లో కూర్చున్న తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చివరకు అంతర్జాతీయ మీడియా కూడా మోడీని తప్పుబట్టింది.
మరో అంశం.. వ్యవసాయ చట్టాలు. కేంద్ర సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు తమ జీవితాలను నాశనం చేసేవిగా ఉన్నాయని రైతులు నిద్రాహారాలు మాని, దేశరాజధానిలో నెలల తరబడి ఆందోళన చేశారు. ఇప్పటికీ పలు చోట్ల కొనసాగుతున్నాయి. ఇక, వారూవీరనే తేడా లేకుండా అందరినీ వేధిస్తున్నవి పెట్రో ధరలు. హద్దూపద్దూ లేకుండా ఇంధన ధరలు పెరుగుతున్నా.. వాటిని పట్టించుకోవట్లేదని దేశప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు కేవలం వాహనదారుల మీదనే కాదు.. నిత్యావసరాల మీద, ప్రతీ వస్తువు మీదా పడి.. ప్రతీ పౌరుడి జేబుకూ బొక్క పెడుతుంది.
ఇంకా.. వ్యాక్సినేషన్ ఇప్పటి వరకూ ఎక్కడిదాకా వచ్చిందో ఊసేలేదు. అసలే థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న వేళ.. నత్తకన్నా దారుణంగా వ్యాక్సినేషన్ సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ముఖ్యమైన విషయాలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేని పరిస్థితి. అయినప్పటికీ.. ఇలాంటి అంశాలను వదిలేసి ‘పెగాసస్’ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నెత్తికెత్తుకున్నాయి విపక్షాలు. ఇది కూడా సమస్యే కావొచ్చు. కానీ.. ప్రజలకు సంబంధించినది కాదు. రాజకీయంగా పార్టీలకు సంబంధించిన విషయం. దీని గురించి చర్చిస్తే.. ప్రజలు ఎందుకు రియాక్ట్ అవుతారు? వాళ్లకు సంబంధించిన విషయాలను చర్చించినప్పుడే జనం ఆలకిస్తారు.
ఈ విషయం విపక్షాలకు తెలియదని అనుకోవాలా? తెలిసీ ఉద్దేశపూర్వకంగా ఇలా వ్యవహరిస్తున్నాయని అనుకోవాలా? ఇదే సరైన వ్యూహంగా భావిస్తున్నాయని భావించాలా? అనేది అర్థం కాకుండా ఉంది. ఇదే వ్యూహం అనుకుంటే మాత్రం.. అది ఖచ్చితంగా విజయవంతమయ్యే స్ట్రాటజీ కాదన్నది సభలను చూస్తే చాలు అర్థమవుతుంది. ప్రజాసమస్యలను ప్రస్తావించినప్పుడే.. జనం స్పందిస్తారు. ఇందుకు రాఫెల్ ముడుపుల అంశమే ఉదాహరణ. ఈ అంశాన్ని సభలో రాహుల్ ఎన్నోసార్లు వినిపించారు. ఇందులో పెద్ద గోల్ మాల్ జరిగిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ.. జనాల్లోకి ఈ అంశం చేరలేదు. ఎందుకంటే.. ఇది వాళ్లకు మరీ అంతగా కావాల్సిన అంశం కాదు. ఇలా చూసుకున్నప్పుడు పెగాసస్ కూడా ఇంతే. మరి, ఈ లెక్కన పార్లమెంటులో విపక్షాలు దారితప్పాయని భావించాలా?