రేపు క్రిస్టమస్ పండుగ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా క్రిస్టియన్. దీంతో తన సొంతూర్లో పండుగను జరుపుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ముందుగానే అక్కడికి చేరుకున్న జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రానికే ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఈ ఉదయం ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
Also Read: నివర్ బాధిత రైతుల కోసం పవన్ ప్రత్యక్ష పోరాటం
పులివెందులలో కొత్త ఆర్టీసీ బస్‌స్టాండ్, అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చిలో వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తారు. జిల్లాలోని యు కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొమరగిరిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరు మీద ప్రభుత్వం 367 ఎకరాలను సేకరించింది. దీనికి సంబంధించిన పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అదే రోజు మిగిలిన చోట్ల ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఉరందూరు వద్ద వైఎస్ జగన్ రెండోదశ ఇళ్ల పట్టాల పంపిణీని చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలను నిర్వహించబోతున్నారు. వారం రోజుల వ్యవధిలో దశలవారీగా మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. అదే రోజు అర్హుల పేర్ల మీద ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్నింటికీ ప్రభుత్వం క్రిస్మస్ సెలవును రద్దు చేసింది.
Also Read: ఏపీ డీజీపీ ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. ఎగురవేసింది ఎవరు?
మరోవైపు.. డాక్టర్ వైఎస్సార్ పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కింద పులివెందులలో నిర్మించతలపెట్టిన గృహ సముదాయానికి వైఎస్ జగన్మోహనపురం అని పేరు పెట్టారు. ఇది కాస్త విమర్శలకు దారి తీస్తోంది. సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు దీనిపై సెటైర్లు సంధిస్తున్నారు. మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు వీరి సెటైర్లకు కౌంటర్ ఇస్తున్నారు.అంతేకాదు.. ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్ పేరిట ఓ కాలనీనీ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రుల పేర్ల మీద కాలనీలు ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పుడు జగన్ పేరు మీద ఓ కాలనీ ఏర్పాటు చేస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు మాత్రం సెటైర్లు వేయడం రాజకీయ దుమారం రేపుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్