కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి రావడం లేదు. దీంతో పాలనా వ్యవహారాలన్ని క్యాంపు ఆఫీసు నుంచే కొనసాగిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జగన్ జనం మద్యకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. రచ్చబండ ద్వారా ప్రజల్ని కలిసే ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం జగన్ పర్యటన గురించి పలు విషయాలు వెల్లడించారు. తొందరలోనే క్షేత్రస్థాయిలో పర్యటనలకు శ్రీకారం చుట్టడంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన జగన్ జిల్లాల పర్యటనతో స్పందన ఎలా ఉంటుందనే దానిపై పలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. మొత్తం సంక్షేమ పథకాలకే కేటాయించారు అభివృద్ధి మరిచారు అనే విషయంలో జనాలు నిలదీసే అవకాశాలు సైతం లేకపోలేదని తెలుస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట జాబ్ క్యాలెండర్ రూపొందించినా అందులో సైతం అభాసుపాలే అయింది. ఎక్కువ మందిలో ఆగ్రహం పెల్లుబికుతూనే ఉంది. ఇప్పుడు జగన్ జిల్లాల పర్యటన చేస్తే కచ్చితంగా నిరుద్యోగులు నిలదీసే సూచనలు కనిపిస్తున్నాయి.
జగన్ చేపట్టబోయే రచ్చబండతో రచ్చ అయ్యే వీలుందని నిపుణులు చెబుతున్నారు. మీటింగ్ కు వచ్చే వారు ఏ పార్టీకి చెందిన వారో తెలియకుండా ఉంటుంది కాబట్టి ఎవరి విపక్షానికి చెందిన వారో ఎవరు స్వపక్షానికి చెందిన వారో గుర్తించడం కష్టమే. ప్రభుత్వం మీద దాడి చేయడానికి టీడీపీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు జన్మభూమి గ్రామసభల్లో సైతం ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం విదితమే.
జగన్ ను కావాలనే బజారుకీడ్చే పనిలో విపక్షాలు ఉన్నట్లు సమాచారం. ఒక వైపు జల జగడాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాల మీద ప్రశ్నలు సంధించే ప్రమాదముంది. రచ్చబండను విజయవంతం చేద్దామని వైసీపీ నేతలు అనుకుంటుంటే దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆలోచించడం సహజమే. జగన్ రెండేళ్ల పాలనలో వ్యతిరేకతలు సైతం ఉన్నాయి. వాటిని దాటుకుని జనంలోకి వెళ్లగలిగితే జగన్ రచ్చబండ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.