Homeజాతీయ వార్తలుKTR in Self-Defence : ప్రత్యర్ధుల రాజీనామా డిమాండ్: ఆత్మరక్షణలో కేటీఆర్

KTR in Self-Defence : ప్రత్యర్ధుల రాజీనామా డిమాండ్: ఆత్మరక్షణలో కేటీఆర్

KTR in Self-Defence : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని ఏఈ ప్రశ్న పత్రం లీకేజీ ఘటన ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. పైగా ఈ వ్యవహారంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి బహుజన్ సమాజ్వాది పార్టీ దాకా ఆందోళనలు చేస్తున్నాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ అయితే రణ రంగంగా మారింది.. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు తెలుస్తున్నాయి.. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు డిమాండ్ చేసేందుకు ఊతం ఇచ్చింది కూడా కేటీఆరే.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాలు లీకేజీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విలేకరుల ఎదుటకు ముఖ్యమైన మంత్రి కేటీఆర్ మాత్రమే వచ్చారు. వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చారు కానీ.. వారెవరూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ మాత్రమే సమాధానం ఇచ్చారు.. ఇలాంటి సమయంలో సాధారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు విలేకరుల ముందుకు రావాలి. జరిగిన తప్పు ఏమిటో చెప్పాలి. విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కేటీఆర్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.. అయితే తాను ఎలా బాధ్యుడిని అవుతానంటూ కేటీఆర్ తిరుగు ప్రశ్న వేస్తున్నారు.

ప్రతిపక్షాలు మాత్రం కేటీఆర్ కు సంబంధం లేనప్పుడు ఆయన ఎందుకు విలేకరుల సమావేశం పెట్టారని ప్రశ్నిస్తున్నాయి.. వాస్తవానికి ప్రశ్న పత్రం అనేది కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది. దీనిని తెలంగాణ ఐటీ విభాగం పర్యవేక్షిస్తుంది. లోప భూయిష్టమైన విధానాల వల్ల ప్రశ్న పత్రం లీకేజీ అయిందని, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా #resignKTR అనే క్యాంపెనింగ్ కూడా మొదలుపెట్టాయి. దీంతో కేటీఆర్ స్పందించాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి. ముఖ్యమైన మంత్రి కేటీఆర్ పిఏ బండారు తిరుపతి సొంత జిల్లాలో చాలామంది వందకు పైగా మార్కులు సాధించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. వాటికి కేటీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న సిరిసిల్ల, నిన్న ఎల్బీనగర్ ప్రాంతాల్లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాల్లోనూ కేటీఆర్ దీని గురించే పదేపదే ప్రస్తావించాల్సి వచ్చింది.

ఇలా కేటీఆర్ పదేపదే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితుల వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధం లేనప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అజమాయిషి కమిషన్ మీద లేనప్పుడు.. అందులో చైర్మన్ గా పనిచేస్తున్న జనార్దన్ రెడ్డితో ఎందుకు రాజీనామా చేయించారని, అమరుసటి రోజు చైర్మన్ గా ఎందుకు నియమించారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితమైన రాజశేఖర్ రెడ్డి అనే అధికారి బావమరిదిని కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో బోర్డు సభ్యుడిగా నియమించారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారని, అందుకే లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం మరుగున పడేస్తోందని వారు చెబుతున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టే కేటీఆర్ స్పందిస్తున్నారని, కానీ ఆ వివరణలు 30 లక్షల మంది అభ్యర్థుల కన్నీళ్లు తుడవలేవని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకసారి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే, అనివార్యమైన పరిస్థితుల్లో ఆ ఉద్యోగ ప్రవేశ పరీక్ష వాయిదా లేదా ఇతర కారణాల వల్ల రద్దు అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ లాజిక్ తెలియని కేటీఆర్ అభ్యర్థులందరి దగ్గర ఎటువంటి ఫీజు తీసుకోకుండానే మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే తన సొంత మీడియా ద్వారా కేటీఆర్ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular