Operation Sheesh Mahal: మద్యం కుంభకోణం, ఖలిస్తాని ఉగ్రవాదులతో సంబంధాలు, స్కూళ్ళ మరమ్మతుల్లో అవకతవకలు.. వీటినుంచి పూర్తిగా బయటపడక ముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ న్యూస్ ఛానల్ “ఆపరేషన్ శీష్ మహల్”పేరిట ప్రసారం చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్ కథనం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇందుకుగాను 45 కోట్ల ఢిల్లీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందని సదరు చానల్ ప్రసారం చేసిన వార్తా కథనంలో పేర్కొంది.
దేశ రాజధానిలోని సివిల్ లైన్స్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంటుంది. దీని మరమ్మతుల కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ డబ్బులు మంచినీళ్లలాగా ఖర్చు చేశాడు. 45 కోట్లు వెచ్చించాడు. కిటికీ తెరల కోసం ఒక్కో దానికి ఎనిమిది లక్షల చొప్పున ఖర్చు చేశాడు. ఆరు కార్పెట్ల కోసం 20 లక్షలు ఖర్చు చేశాడు. ఆరు ఆల్మారాల కోసం 40 లక్షలు వెచ్చించాడు. ఇంట్లో మొత్తం మార్బుల్ పరిచేందుకు మూడు కోట్లు ఖర్చు చేయించాడు. ఆ మార్బుల్ కూడా వియత్నాం దేశం నుంచి దిగిన చేసుకున్నాడు. తెచ్చిన ఆ మార్బుల్ అతికించేందుకు 21.6 లక్షలు ఖర్చు చేశాడు. వంట గదులను మాడ్యులర్ కిచెన్ గా మార్చేందుకు 69 లక్షలు వెచ్చించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దది.. ఈ లెక్కన చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కోసం ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేశాడు. ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి మరో కొత్త దాన్ని కట్టాడు. కెసిఆర్ ను ఆదర్శంగా తీసుకున్నాడు ఏమోగానీ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయన దారిలో పయనిస్తున్నాడు.
వానికి ఒక ముఖ్యమంత్రి నివాసానికి 45 కోట్లు ఖర్చు చేయడం పెద్ద వార్త అవుతుందా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అది కానే కాదు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే తన ఎన్నికల వాగ్దానాలలో అరవింద్ కేజ్రివాల్ నేను అందరి ముఖ్యమంత్రుల లాగా ప్రభుత్వ అధికారిక బంగ్లాలలో ఉండను. నేను సాదాసీదా అపార్ట్మెంట్లో ఉంటూ పాలన సాగిస్తానని హామీ ఇచ్చాడు. మిగతా రాజకీయ పార్టీలు 2000 కోట్లు మరమ్మతులకు కేటాయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన అధికారిక నివాసం కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు. ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోగా, అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి ఏడాది తర్వాత ఖాళీ చేశాడు. అంతే కాదు యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఇటాలియన్ టైల్స్ ను పెకిలించి మరీ తీసుకువెళ్లాడు. మూత్ర శాలలో ఉండే వాష్ బెసిన్లు, కుళాయిలు కూడా పీక్కోనిపోయాడు. అందుకే కదా ఉత్తరప్రదేశ్ ప్రజలు గత ఎన్నికల్లోనూ ఈడ్చితన్నింది.
అయితే ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ 45 కోట్లు ఖర్చుపెట్టిన సమయం, సందర్భం మీద ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2020 కోవిడ్ మహమ్మారి మన దేశాన్ని వణికిస్తున్న సమయంలో ఖర్చు పెట్టాడు. అప్పట్లో ఢిల్లీలో కోవిడ్ నివారణ చర్యల మీద కోర్టులో కేసు నడుస్తోంది.. వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్లు కొనేందుకు తమ వద్ద తగినన్ని నిధులు లేవని కోర్టు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానంగా చెప్పిన అరవింద్ కేజ్రివాల్.. తన అధికారిక నివాసం మరమ్మతుల కోసం 45 కోట్లు ఖర్చు చేయడాన్ని ఇక్కడ తప్పు పట్టాల్సి వస్తుంది.
ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దాని బారి నుంచి రక్షించుకునేందుకు కేవలం 350 రూపాయల మఫ్లర్ మాత్రమే కొంటాను అని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్.. అధికారిక నివాసంలోకి ఎవరూ తొంగి చూడరనే భావనతో 45 కోట్లు ఖర్చు పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఒక న్యూస్ ఛానల్ కు ఈ ఖర్చుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించడంతో అది వార్త కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.. సామాన్యుడికే అధికారం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రివాల్.. అధికారం దక్కిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడంతో నెటిజెన్లు ఏకి పారేస్తున్నారు. చీపురు కట్ట గుర్తుతో ఢిల్లీ సంపదను మొత్తం ఊడ్చిపడేస్తున్నాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.