ABN RK- Kadiyam Srihari: కాంగ్రెస్ బలాన్ని గుర్తిస్తున్న బీఆర్ఎస్

గురుకులాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను కూడా కడియం శ్రీహరి మెచ్చుకున్నారు." గురుకులాల విషయంలో ప్రవీణ్ కుమార్ కాంట్రిబ్యూషన్ కాదనలేం.

Written By: Bhaskar, Updated On : July 17, 2023 12:01 pm

ABN RK- Kadiyam Srihari

Follow us on

ABN RK- Kadiyam Srihari: “రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి చాలా మెరుగుపడింది.” ఈ మాటలు అన్నది ఎవరో కాదు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో వర్తమాన రాజకీయాలపై కీలక విషయాలను శ్రీహరి పంచుకున్నారు. “నాకున్న సమాచారం ప్రకారం 14 నుంచి 15% ఓట్లు బిజెపికి వస్తాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. అది ఇంకా దిగజారి 8 నుంచి 10 శాతం చేరుతుందా? చూడాలి ఏం జరుగుతుందో? కాంగ్రెస్ ఒకప్పుడు 18% ఓటు బ్యాంకు తో ఉండేది. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో 25 నుంచి 35 శాతానికి పెరిగింది. అయితే మేము నేటికీ చాలా నియోజకవర్గాల్లో 45 నుంచి 60 శాతం పాజిటివ్ బ్యాంకుతో ఉన్నాం. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు అసలు అభ్యర్థులే లేరు” అని శ్రీహరి రాధాకృష్ణ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

దళిత బంధు వల్ల కొంత ఇబ్బంది ఉంది

దళిత బంధు పథకానికి సంబంధించి కడియం శ్రీహరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నప్పుడు, అందరికీ మేము ఇవ్వలేనప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. దళిత బంధును సంతృప్తికరమైన స్థాయిలో అమలు చేయాలని లక్ష్యం ప్రభుత్వానికి ఉంది. అది ఒక్క ఏడాదిలో పూర్తి చేయలేం. దానిని ఐదేళ్లలో పూర్తి చేయాలనేది కేసీఆర్ లక్ష్యం..” అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇక విద్యాశాఖకు సంబంధించి కూడా పలు విషయాలు వెల్లడించారు..” భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కువ శాతం గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. ప్రస్తుతం తెలంగాణలో 1,019 గురుకులాలు, 475 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, 194 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ రెసిడెన్షియల్. ప్రజలు ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా సదుపాయాలు, వసతులు పెంచాల్సిన అవసరం ఉంది.

ప్రవీణ్ కుమార్ ను మెచ్చుకోవాలి

గురుకులాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను కూడా కడియం శ్రీహరి మెచ్చుకున్నారు.” గురుకులాల విషయంలో ప్రవీణ్ కుమార్ కాంట్రిబ్యూషన్ కాదనలేం. కెసిఆర్ ది పాలసీ. దాన్ని ప్రవీణ్ కుమార్ అమలు చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది. మా దగ్గర 8.6 లక్షల మంది పిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం ఏడాదికి 1.20 లక్షలు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ముఖ్యమంత్రి మనవడు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. కానీ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది” అని శ్రీహరి వ్యాఖ్యానించారు.

ఆంధ్ర పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది

“ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. జాలి కూడా వేస్తుంది. ఆ రాష్ట్రాన్ని పూర్తిగా కులం వైపు తీసుకెళ్లారు. కులం ఆధారిత రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడప్పుడూ జగన్ మాట్లాడే రెండు మాటలు వింటూ ఉంటే నవ్వొస్తుంది. ఆయన అవినీతిపై పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెబుతుంటాడు. అవినీతిపై జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయన మీదనే సిబిఐ అనేక కేసులు పెట్టింది. అనేక కేసుల్లో ఆయన ఏ_1గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటాడు. నేను మొన్న చూసా. దేశంలోనే రిచెస్ట్ సీఎం అయి ఉండి అలా ఎలా మాట్లాడుతారు” అని శ్రీహరి కుండ బద్దలు కొట్టారు.