Huzurabad by election: హుజూరాబాద్.. ఇక్కడ ఎన్నికలు అనివార్యం అని అనుకున్న దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నానుతున్న పేరు. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామా చేయడం, వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం నోటిఫికేషన్ రావడం, నామినేషన్లు వేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ప్రచార పర్వం కూడా ముగిసిపోయి ఎన్నిక కూడా కొనసాగుతోంది. దీంతో రాష్ట్రం చూపు మొత్తం ఈ ఎన్నికపై పడింది. ఎన్నికల జరుగుతున్న తీరు, చిన్న చిన్న గొడవలు అంతా గమనిస్తున్నారు. అయితే క్రికెట్‌లో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో సాగే బెట్టింగ్ లు.. ఈ హుజూరాబాద్ ఎన్నికలపై కూడా సాగుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.

పలానా అభ్యర్థే గెలుస్తాడని బెట్టింగ్..
హుజూరాబాద్ ఎన్నికల రసవత్తరంగా మారాయి. మొదటి నుంచి ఇక్కడ బడా నాయకులే ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తరుపున రాష్ట్ర మంత్రులు, బీజేపీ తరపున కేంద్ర మంత్రి, ఇతర ముఖ్యనాయకులు ప్రచారం నిర్వహించారు. ఎవరి ప్రచారంలో వారు దూసుకుపోయారు. విమర్శలకు, ప్రతి విమర్శలు చేస్తూ ఢీ అన్నారు. అందతా ముగిసిపోయి ఈ రోజు ఎన్నికల్లో తలపడుతున్నారు. అయితే ఇందులో పోటీ పడుతున్న అభ్యర్థులు, ఆయా పార్టీల కంటే ఎక్కువ ఆసక్తిగా ఇంకో టీం ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది. అదే బెట్టింగ్ టీం. ఈ ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ సాగుతోంది. కొందరు బెట్టింగ్ రాయుళ్లు హుజూరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఫోన్ చేస్తున్నారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రశ్నలు అడుగుతున్నారు. దాని ప్రకారం తమకు ఇష్టం వచ్చిన అభ్యర్థిపై బెట్టింగ్ కాస్తున్నారు. రూ. 5 వేలు కాస్తే రూ. 50 వేలు, రూ. 10 వేలు కాస్తే రూ.1 లక్ష ఇచ్చేట్టు బెట్టింగ్‌లు సాగుతున్నట్టు సమాచారం. కౌంటింగ్ రోజు కూడా మరో రకం బెట్టింగ్ ఉండబోతోందని తెలుస్తోంది.
చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు..
క్రికెట్‌లాగా ఇలా రాజకీయ నాయకులపై, ఎన్నికలపై బెట్టింగ్‌లు కాయడం కొంచెం కొత్తగానే కనిపిస్తోంది. అయితే ఇది ఈ ఎన్నికలకే ప్రారంభం కాలేదని, గత కొన్ని ఎన్నికల నుంచే ఈ ట్రెండ్ నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. అయితే ఇలా బెట్టింగ్‌లు కాసే వారిపై, ఆ బెట్టింగ్ లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బులు అడిగిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశామని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ చెప్పారు. ఓటర్లు ఓటు కోసం డబ్బులు అడగటం తమ దృష్టికి వచ్చిందని, దానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏది ఏమైనా ఓటర్లు డబ్బులు అడిగేందుకు బయటకు వచ్చి ఆందోళన చేయడం, బెట్టింగ్ రాజాలు రంగంలోకి దిగి క్యాష్ చేసుకోవడం ఈ హుజూరాబాద్ ఎన్నికల్లోనే కనిపించిన విచిత్రాలు. ముందు ముందు జరగబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి ఉంటుందో.