తెలంగాణలో 48 గంటల పాటు ప్రభుత్వ వెబ్ సైట్లు నిలిచిపోనున్నాయి. యూపీఎస్ఎస్ అప్డేట్ కారణంగా దాదాపు రెండు రోజుల పాటు సర్వర్లు పనిచేయవని ఐటీ శాఖ ప్రకటించింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోనున్నాయి. అయితే రెండో శనివారం, ఆదివారం కావడంతో ప్రజలకు పెద్దగా ఇబ్బందులుండే అవకాశం లేదు. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం శుక్రవారం కూడా పనిచేయవు. ఎందుకంటే గురువారం రాత్రి నుంచే వెబ్ సైట్ సేవలు నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర ఆన్ లైన్ సేవలన్నీ హైదరాబాద్లోని గచ్చిబౌలి కేంద్రంగా ఉన్న స్టేట్ డేటా కేంద్రంగా పనిచేస్తాయి. అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్ సైట్లు ఈ సెంటర్ అనుసంధానంగా పనిచేస్తాయి. అయితే ఈ సెంటర్లోని యూపీఎస్ఎస్ మార్చనున్నారు. దీంతో వెబ్ సైట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. అయితే రెండు రోజులు సెలవు దినాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ రెండు రోజుల్లో యూపీఎస్ఎస్ ను మార్చాలని చూస్తున్నారు.
గత కొన్ని రోజులుగా యూపీఎస్ఎస్ లో అనేక సమస్యలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వ వెబ్ సైట్ల పనుల్లో అంతరాయం కలిగింది. ఇక్కడి యూపీఎస్ఎస్ మార్చాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఈ రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఆ పని పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ప్రభుత్వ వెబ్ సైట్లను నిలిపివేస్తారు.
ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం కలగనుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉనన కార్డ్ విధానం పనిచేయవు. అయితే గురువారం రాత్రి నుంచే ఈ శాఖకు సంబంధించిన సేవలను ఒకరోజు ముందే నిలిపివేశారు. అయితే రిజిస్ట్రేషన్లు మూడు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. తిరిగి సోమవారం పున: ప్రారంభం కానున్నాయి.