Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో దారుణం.. ఒకరి మృతి

ఢిల్లీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిన రాజధాని వాసులు వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 28, 2024 11:29 am

Delhi Airport

Follow us on

Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌–1 పైకప్పు కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు, కార్లపై పడడంతో ఒకరు మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ఒక వ్యక్తిని కాపాడారు. ఈ ఘటనలో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి.

వర్షాలకేనా..
ఢిల్లీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిన రాజధాని వాసులు వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు చాలా ప్రాంతాల్లో నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగాయి.ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌ – 1 పైకప్పు కూడా వర్షాలకు నాని కూలినట్లు భావిస్తున్నారు.

టెర్మినల్‌ – 1 నుంచి విమాన సర్వీసులు రద్దు..
టెర్మినల్‌ –1 పైకప్పు కూలిన కారణంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు టెర్మినల్‌ –1 నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు టెర్మినల్‌ను క్లియర్‌ చేసి సర్వీసులను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

ఘటన స్థలికి కేంద్ర మంత్రి..
ఇదిలా ఉంటే.. ఢిల్లీ విమానాశ్రయంలో టర్మినల్‌–1 పైకప్పు కూలిన విషయం తెలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హుటాహుటిని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కూలిన టెర్మినల్‌ –1 పైకప్పును పరిశీలించారు. ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ప్రాథమిక విచారణ నివేదిక వచ్చిన తర్వాతనే ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందని తెలిపారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.