Oil Price: ఏపీలో వంట నూనె ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ పెరుగుతున్నాయి. రోజుకో రేటుతో సామాన్య, పేద ప్రజలకు మోయలేని భారం మోపుతున్నాయి. ఏడాది కిందట వరకూ లీటరు నూనె రూ.95 వరకూ ఉండగా.. ఇప్పుడు 100 శాతం ధర పెరిగి రూ.200కు చేరువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధర లీటరుపై ఒకేసారి రూ.20 పెరిగింది. ఆదివారం నాటికి లీటరు ధర రూ.150 ఉండగా.. మంగళవారానికి రూ.170కి చేరింది. ఇప్పటికే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. పామాయిల్ ధర కూడా పెరిగినా ఆ తర్వాత కాస్త తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధర కూడా ఇక్కడితో ఆగుతుందని చెప్పలేమని, ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 28 నుంచి వంటనూనెల ఎగుమతులను నిషేధించాలని ఇండోనేషియా నిర్ణయించడంతో దేశంలోని వ్యాపారులు ముందుగానే కృత్రిమ కొరతకు తెరతీశారు. పామాయిల్ విషయంలో భారత్ సహా అనేక దేశాలు ఇండోనేషియా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో ఈ సమస్య తలెత్తింది. దేశంలో నిల్వలు ఉన్నప్పటికీ ఆ దేశ ప్రకటనను సాకుగా చూపి వ్యాపారులు ముందుగానే ధరలు పెంచేశారు. ఇందుకు అనుగుణంగా ప్యాకెట్లపై పెంచిన ధరలను ముద్రించారు. తద్వారా వ్యాపార వర్గాలు అధికారికంగానే దోపిడీకి దిగాయి.
Also Read: Abu Dhabi: బాల్కనీలో బట్టలు ఆరేస్తే అంతే.. రూ.20 వేల జరిమానా కట్టుకోవాల్సిందే
యుద్ధాన్ని సాకుగా చూపి..
అయితే వ్యాపారులు ధర పెరుగుదల విషయంలో వింత వైఖరిని అవలంభిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతున్నారు. వాస్తవానికి ఆ రెండు దేశాల మధ్య యుద్దానికి ముందు రాష్ట్రంలో వంటనూనెల ధరలు కొంత స్థిరంగానే ఉన్నాయి. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో వంట నూనెల ధరలు క్రమంగా పెరిగాయి. యుద్ధం సాకుగా చూపి వ్యాపార వర్గాలు నిల్వలు దాచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. యుద్ధం మొదలుకాక ముందు రాష్ట్రంలో పామాయిల్ లీటర్ ధర రూ.125 ఉండేది. యుద్ధం ప్రారంభమయ్యాక రూ.165కు పెరిగి మళ్లీ రూ.150కు తగ్గింది. ఇప్పుడు మళ్లీ రూ.170కు పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.150 నుంచి రూ.200కి చేరింది. వంటనూనెల విషయంలో పరిస్థితులను గమనించిన హోల్‌సేల్ వ్యాపారులు ముందుగానే ఎక్కువ రేట్లకు ఎమ్మార్పీలు ముద్రించారు. ప్రస్తుతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను రూ.200 కు అమ్ముతుండగా, ఎమ్మార్పీ మాత్రం రూ.215గా ముద్రించారు. పామాయిల్ ప్యాకెట్లపై ఇదివరకే రూ.170 ముద్రించారు. తాజాగా అదే ధరకు పెం చారు. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో పాటు వేరుశెనగ నూనెల ధరలు కూడా పెరిగాయి. వాటి వాడకం తక్కువ కావడంతో పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. మొన్నటివరకూ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆ భారం మోయలేని వారు పామాయిల్‌కు మారారు. ఇప్పుడు పామాయిల్ ధర కూడా పెరగడంతో ప్రజలకు ఆర్థిక భారాన్ని తప్పించుకునే దారి లేకుండా పోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు
అయితే ఏపీ ప్రభుత్వం కొంత ఆలస్యంగా మేల్కొంది. ఫిబ్రవరి నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా వంట నూనెల అమ్మకాలపై తనిఖీలు ప్రారంభించింది. ఇప్పటివరకూ మొత్తం 2,007 కేసులు నమోదు చేసింది. అందులో 1,674 ఎమ్మార్పీకి మించి అమ్మిన కేసులు ఉన్నాయి. ఇతరత్రా ఉల్లంఘనల్లో మిగతా కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 1,719 లీటర్ల నూనెలను సీజ్ చేశారు. వ్యాపారులకు రూ. 43.95 లక్షల జరిమానాలు విధించారు. సాధారణ స్థాయిలోనే ఎమ్మార్పీలున్న ప్యాకెట్లను.. యుద్ధం మొదలయ్యాక అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఎక్కువగా కేసులు నమోదు చేస్తున్నారు. కొందరు ఎమ్మార్పీ దాటి అమ్ముతుండగా, అనేక చోట్ల ఎమ్మార్పీ కనిపించకుండా చెరిపివేస్తున్న ఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. అక్కడక్కడా తూకంలో కూడా తేడాలున్నట్లు గుర్తించారు.
Also Read:BJP Congress Attack: బీజేపీ, కాంగ్రెస్ అటాక్.. కేసీఆర్ నిర్ణయం ఎటు వైపు?