
ఓ వైపు కరోనా.. మరోవైపు ముదురుతున్న ఎండల వేళ ఇప్పటికే ఒక సంవత్సరం కోల్పోయిన విద్యార్థులకు ఇప్పుడు ఒంటిపూట బడులతో సగం విద్యకే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మండుతున్న ఎండల దృష్ట్యా ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారికంగా ప్రకటించారు. 1-10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులను ఆయన వెల్లడించారు.
ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు ఉంటాయని.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అందరూ ఈ టైమింగ్ ను పాటించాలని సూచించారు.
ఎండలు, కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇటీవల పాఠశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనల అమలుపై మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.