PM Modi: ప్రపంచ మొత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీని విశ్వగురువుగా చూస్తోంది. వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే శత్రు దేశాలకు కూడా అంతేస్థాయిలో మన బలం చాటుతున్నారు మోదీ. వైలెన్స్ లేకుండా.. సైలెన్స్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విషయంలో కూడా మోదీ తన చతురత ప్రదర్శించారు. మిత్ర దేశం రష్యాను దోషిగా చూపేందుకు ఇష్టపడలేదు. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా దృష్టిలో భారత్ రష్యా పక్షం అని ప్రకటించకుండా చూశారు. అమెరికాతో సత్సంబంధాలు నెరుపుతూనే, యుద్ధ సమయంలో రష్యాకు ఆర్థికంగా అండగా నిలిచారు. పెట్రోలియం ఉత్పత్తులను తక్కువ ధరకు భారత కరెన్సీలో కొనుగోలు చేశారు. జీ20 సదస్సును దిగ్విజయంగా నిర్వహించి ఔరా అనిపించారు. అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోదీని దేశంలోని విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా విపక్షంలో ఉన్నాం కాబట్టి.. విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లు మోదీని, ఆయన పాలనను తప్పు పడుతున్నాయి. కొన్ని పార్టీలు మోదీ పక్షాన నిలబడుతున్నాయి.
మోదీ పాలనను మెచ్చుకున్న ఒడిశా సీఎం..
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. రాజకీయాలకు దూరంగా ఉంటారు. దేశంలో అత్యధిక కాలం సీఎంగా రికార్డు సృష్టించిన నవీన్ పట్నాయక్ తన పని తాను చేసుకుంటూ పోతారు. పొరుగు రాష్ట్రాలతో కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కానీ గొడవలు పెట్టుకోరు. ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇస్తూ ఉంటారు. తన పరిధిలో రాష్ట్ర ప్రజలకు ఉన్నంతలో మంచి చేయాలని చూస్తుంటారు. అందుకే ఆ రాష్ట్ర ప్రజలు వరుసగా ఐదోసారి నవీన్ పట్నాయక్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. వివాద రహితుడయిన నవీన్ పట్నాయక్ ఎవరినీ పొడగరు.. అలా అని ఎవరినీ విమర్శించరు. కానీ తొలిసారి ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు.
మోదీ పాలనకు 8/10 మార్కులు..
నరేంద్రమోదీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పదికి ఎనిమిది మార్కులు వేశారు. కేంద్ర ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. తనకు రాజకీయాలకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర సాహిత్య ఉత్సవాల్లో భాగంగా మోదీ పాలనను ప్రశంసించారు. మోదీ విదేశాంగ విధానం, అవినీతి నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం మహిళా సాధికారతకు ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. బహుషా ఒడిశా ముఖ్యమంత్రి ఒక ప్రధానిని, ఆయన పాలనా విధానాన్ని ప్రశంసించడం ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.