Beach Sand: ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. నెల్లూరు జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు వంటివి ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. తీర ప్రాంతంలో వేలాది ఎకరాలను ఆదాని వంటి కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతోంది. తాజాగా విశాఖ తీర ప్రాంతంలో.. బీచ్ శాండ్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం.. వెనువెంటనే టెండర్లకు పిలవడం చూస్తుంటే.. ఇక్కడ ఏదో అంతర్జాతీయ స్కాం కు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బీచ్ శాండ్ తవ్వుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అయితే ఇది కేంద్రానికి తెలిసి చేస్తున్నారో.. తెలియకుండా చేస్తున్నారు చూడాలి.
తీర ప్రాంతంలో ఉన్న ఇసుకలో మోనోజైట్ ఉంటుంది. ఇది అణుబాంబుల తయారీకి ఉపయోగిస్తారు. అణు విద్యుత్ ఉత్పత్తిలోనూ దీనిని వాడుతారు. అయితే వీటి కోసమే బీచ్ శాండ్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈపాటికే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి విదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. కేంద్ర యంత్రాంగం పరిశీలనలో కూడా ఇది స్పష్టమైంది. ఇది అత్యంత ఖరీదైన, అరుదైన ఖనిజం. అందుకే దీనిని అక్రమ వ్యాపారంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. కానీ అటు తర్వాత ఈ అంశం మరుగున పడిపోయింది. ఇప్పుడు ఏకంగా బీచ్ శాండ్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా టెండర్లకు పిలుస్తుండడం విశేషం.
ఇప్పటికే విశాఖ నగరంలో పర్యాటక ఆనవాళ్లు లేకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖకి ల్యాండ్ మార్క్ గా నిలిచే రుషికొండను ధ్వంసం చేశారు. పూర్తి రూపురేఖలను మార్చేశారు. కనీసం అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతున్నారో చెప్పడం లేదు. పైగా తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా విశాఖ తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు టెండర్లకు పిలుస్తుండడంతో.. బీచ్ రూపు కోల్పోయే అవకాశం ఉంది. పర్యాటకులకు అసౌకర్యం కలిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ నగరం పర్యాటకంగా పెట్టింది పేరు. కానీ జగన్ సర్కార్ కళా విహీనం చేసేందుకు ప్రయత్నిస్తుండడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో గత నాలుగున్నర ఏళ్ల కాలంలో విధ్వంస పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎక్కడా దిద్దుబాటు చర్యలు లేవు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. బీచ్ శాండ్ పేరిట జరుగుతున్న దోపిడికి అంతే లేకుండా పోతోంది. అణు అవసరాల కోసమే ఈ రకమైన ఇసుకను వినియోగిస్తారు. కానీ ఇక్కడ నుంచి ఏ దేశానికి తరలిస్తారు? అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇలా చేస్తే దానిని దేశద్రోహం గానే పరిగణిస్తారు. వీటి విషయంలో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రత్యేకమైన నిబంధనలను ఏర్పాటు చేశారు. కానీ ఆ నిబంధనలు ఏపీలో అమలు కావడం లేదు. ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ఇసుక తవ్వకాలకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తుండడం విశేషం.