విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డు లను ఎలా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 16 పడకల సామర్థ్యం తో రెండు ఐసోలేషన్ వార్డులను ఈ ఆసుపత్రిలో అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ నివాస ప్రాంతాలు ఉండటంతో ఈ వైరస్ అక్కడి వారికి సోకుటుందనే సందేహంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి సైతం తీసుకువెళ్లారు. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న చోట్ల నివాస ప్రాంతాలకు దూరంగా అప్పటికప్పుడు తాత్కాలిక ఆసుపత్రి నిర్మించి ఐసోలేషన్ వార్డులు విదేశాలలో ఏర్పాటు చేసిన సంగతి తెలుసుకున్న నగరవాసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు వెంటనే ఇక్కడ నుంచి తొలగించి నివాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం ఈ అంశంపై అధికారుల తీరును తప్పుబట్టారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, ఐసోలేషన్ వార్డులు నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని’ ట్విట్టర్ లో కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు