పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రాష్ట్రానికి మొత్తం ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. మరో నాలుగు విడతలు మిగిలి ఉన్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 135 స్థానాల అభ్యర్థిల్లో భవితవ్యం ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక మిగిలిన 159 స్థానాల నుంచి బరిలో నిలుస్తున్న అభ్యర్థుల భవితవ్యం మరో రెండు వారాల్లో తేల్చనున్నారు. కీలక ఐదో విడత ఎన్నికలు ఏప్రిల్ 17న, చివరి విడత ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్నాయి.
అయితే.. ఈసారి బెంగాల్ ఎన్నికలు కులాలు శాసిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈసారి ఓబీసీలు ఎటుమొగ్గు చూపితే వారిదే అధికారం అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఎంసీ, బీజేపీలు సైతం లెక్కలు వేసుకుంటున్నాయి. అంతేకాదు.. ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోల్లోనూ కులాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా ఓబీసీ కులస్తులే ఎందుకు కీలకం అయ్యారంటే.. గత ఎన్నికల్లోనూ వారిదే హవా కనిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీలు మొత్తం బీజేపీ వైపే మొగ్గుచూపారు. దీంతో ఎన్నడూలేని విధంగా బెంగాల్‌లో బీజేపీ 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే..ఆ పొరపాటు ఈసారి జరగకూడదని దీదీ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఓబీసీలతోపాటు మహిషి, తేలి, సాహా వంటి కులాలకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తామంటూ హామీలు కురిపించింది.
అయితే.. దీదీ హామీలకు దీటుగా బీజేపీ కూడా స్పందించింది. ఓబీసీలో చేర్చకుండా మమత ఏయే కులాలను అడ్డుకుంటోందో వాటన్నింటినీ తాము ఓబీసీ జాబితాలో చేర్చుతామంటూ హామీ ఇచ్చింది. మండల్ కమిషన్ ప్రాతిపదికన మహిష్క, తిల్లి వంటిఇతర హిందూ కులాలకు సైతం ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. మొత్తంగా ఈసారి కులాల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయనేది స్పష్టమవుతోంది. అంతేకాదు.. టీఎంసీ, బీజేపీలు పోటాపోటీ హామీలతో ఏ పార్టీకి ఓట్లు పడుతాయో.. ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి మరి.