Telangana Job Notification: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇక ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ల విడుదలతో జాప్యం చేస్తోంది. ఫలితంగా అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఇకనైనా తమ భవిష్యత్ మారుతుందని భావించినా దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా పరిస్థితి మారటం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసినా వాటి భర్తీకి నోటిఫికేషన్లు మాత్రం రావడం లేదు. దీంతో నిరుద్యోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. మార్చి 23న 30 వేల ఖాళీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం మంజూరు ఇచ్చినా ఇందులో గ్రూప్స్ ఉద్యోగాలు ఉండటంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఇన్నాళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూసిన సందర్భంలో ఇకనైనా తమ కల నెరవేరుతుందా అంటే లేదనే విషయం స్పష్టమవుతోంది.
నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే ఉద్దేశంతోనే టీఎస్పీఎస్ ముందస్తు చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేశాక మళ్లీ ఏదైనా న్యాయపరమైన చిక్కు ఎదురైతే వాయిదా పడితే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారనే నోటిఫికేషన్ విడుదలలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ నిరుద్యోగులకు మాత్రం ఆలస్యం అమృతం విషం అనే ధోరణిలోనే ఉన్నారు.
ఇప్పటివరకు 16 శాఖలకు చెందిన ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్, రోస్టర్ వివరాలు వచ్చాయని టీఎస్పీఎస్ చెబుతోంది. ఇంకా మూడు శాఖలకు సంబంధించిన వివరాలు రావాల్సి ఉందని సూచిస్తోంది. అందుకే అన్ని వివరాలు వచ్చాకే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పేర్కొంది. అందుకే ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడానికి ఆలస్యం జరుగుతోంది. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించడమే ధ్యేయంగా ఉన్న నిరుద్యోగుల ఆశలు ఎప్పటికి తీరేనో ఎదురు చూడాల్సిందే మరి.
Also Read:Balakrishna New Look: వైరల్ : ఓల్డ్ గెటప్ లో హీరో.. పవర్ ఫుల్ గెటప్ లో విలన్