TSPSC: ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు. కానీ నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎన్నికల్లో గెలవగానే గత మనదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పాలనాంపరమైన నిబంధనలు ఉన్న రాజ్యాంగాన్ని కూడా పాటించడం లేదు. తమ పాలనకే రాజ్యాంగంలో కొత్త భాష్యం చెబుతున్నారు. తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు ఇలాంటి తరహా పాలనే జరిగింది. దీంతో విసిగిపోయిన ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గత పాలకులను ఓటు ద్వారా ఇంటికి పంపించారు. కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గతంలో గడీల పాలనలా కాకుండా ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. నీ పని చేసిన సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గత పాలకులకు భిన్నంగా రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. దానికి తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నియామకం కోసం చేపట్టిన ప్రక్రియ.
దరఖాస్తుల స్వీకరణ..
గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఆ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరింది. స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్ కమిటీ ద్వారా స్క్రూటినీ చేస్తారు.
పారదర్శకతకు పెద్దపీట..
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీకి వెళ్లినపుడు యూపీఎస్సీ చైర్మన్‌తో ఆయన భేటీ అయ్యారు. చైర్మన్, సభ్యుల నియామకంతోపాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, మాజీ కార్యదర్శి. వాణీ ప్రసాద్ నేతృత్వంలోని బృందాలు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సందర్శించి పలు వివరాలను సేకరించాయి.