Homeఎడ్యుకేషన్Navodaya admissions  Notification  :  నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులు వీరే!

Navodaya admissions  Notification  :  నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. అర్హులు వీరే!

Navodaya admissions  Notification  : వచ్చే విద్యా సంవత్సరం(2025–26) జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 653 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025 ఏప్రిల్‌ 12(శనివారం) ఉదయం 11:30 గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో 2025, జనవరి 18(శనివారం) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని తర ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 16 వరకు https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు..
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా విద్యాలయం ఉన్న జిల్లావాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

వయసు..
ఇక దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2013 మే 1 నుంచి 2015 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. గరిష్టంగా విద్యార్థి వయసు 11 ఏళ్లు మించకూడదు.

ప్రవేశ పరీక్ష ఇలా..
జవహర్‌ నవోదయ పాఠశాలల్లో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ, ఆర్థమెటిక్, లాంగ్వేజ్‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు, వంద మార్కులకు 2 గంటల సమయంలో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం ఇలా…
ఆన్‌లైన్‌లో నవోదయ అధికారిక వెబ్‌సైట్‌. https://cbseitms.rcil.gov.in/nvs/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. దీంతోపాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.

ఎంపిక ఇలా…
ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి నాటికి విడుదల చేస్తారు. పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహణ..
గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం జవహర్‌ నవోదయ విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యామంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నవోదయ విద్యాలయ సమితి అనే స్వతంత్ర సంస్థ నిర్వహిస్తోంది. జేఎన్‌వీలు గురుకుల పాఠశాల పద్ధతిలో, బాల బాలికలకు విద్యనందిస్తాయి. ఇక్కడ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) అనుసంధానంతో 6వ తరగతి నుంచి 12వ తరగతి(ఇంటర్మీడియెట్‌ ఆఖరి సంవత్సరం) వరకు చదువు చెప్పారు.

ఉచిత విద్య, వసతి..
జవహర్‌ నవోదయ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు సకల సౌకర్యాలతో కూడిన వసతి కల్పిస్తారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్రమే చెల్లిస్తుంది. ఇక్కడ విద్యార్థులు ఏడేళ్లపాటు ఉచిత విద్యను పొందుతారు. 1985, ఏప్రిల్‌ 13న నవోదయ విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. 1985–86 విద్యా సంవత్సరం కేవలం ఝజ్జర్‌(హరియాణా), అమరావతి(మహారాష్ట్ర)లో మొదట స్థాపించారు. తర్వాత క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 653 విద్యాలయాలు ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular