
ఓటుకు నోటు కేసులో ఓ వైపు ఏసీబీ.. మరో వైపు ఈడీ చార్జీషీట్లతో తెలంగాణకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ఆయనకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి తాజాగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏసీబీ చార్జీషీట్ ఆధారంగా ఈడీ రేవంత్ రెడ్డిపై చార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో సాక్షులందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాతనే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే ఈ ఓటుకు నోటు కేసులో ఈ వినతిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం.
దీంతో విచారణను పూర్తి చేశాకనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా రేవంత్ రెడ్డిపై మోపిన అభియోగాలు, కేసు విచారణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.