దేశంలో కొవిడ్ కల్లోలం అత్యంత దారుణంగా ప్రభావం చూపిస్తున్న వేళ.. రోగులు ఊపిరాడక చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సూచించిందో.. కంపెనీలకే బుద్ధిపుట్టిందో గానీ.. దేశంలో సుమారు వంద మెడికల్ ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. చట్ట ప్రకారమే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తమ లాభాల్లో 2 శాతం నిధులు ఖర్చు చేయాలన్నది నిబంధన. దాన్ని ఇలా ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయి. నిజానికి.. వాటి లాభాలతో పోల్చుకుంటే.. చాలా చాలా చిన్న మొత్తం ఇది.
అయితే.. ఈ ప్లాంట్లను దేశంలో ఎక్కడెక్కడ పెట్టాలో కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. లిస్టు ఫైనల్ అయిన తర్వాత చూస్తే.. అందులో తెలుగు రాష్ట్రాలకు చోటే లేదు. కనీసం.. ఒక్క ఆక్సీజన్ ప్లాంటు కూడా కేటాయించకపోవడం దారుణం. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మెజారిటీ ప్లాంట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ లో మాత్రమే ఉన్నట్టు సమాచారం. మిగిలిన ప్లాంట్లన్నీ బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాలకే కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి.
కానీ.. ఆయిల్ కంపెనీలు ఎక్కువగా గ్యాస్, ఆయిల్ సేకరిస్తున్న ప్రాంతాల్లో ఏపీ ముందు వరసలో ఉండడం గమనార్హం. కృష్ణా, గోదావరి బేసిన్ నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ తోడేసి, డబ్బులు సంపాదించుకుంటున్నాయి కంపెనీలు. సాధారణంగా.. వాడుకున్న ప్రాంతాలకు అంతోఇంతో ఇవ్వడం కనీస ధర్మంగా భావిస్తుంటారు. కానీ.. ఇంతటి దారుణ సంక్షోభంలో కూడా ఏపీకి ఒక్క ఆక్సీజన్ ప్లాంటును కూడా కేటాయించకపోవడం పాలకుల సమ న్యాయానికి అద్దం పడుతోందని అంటున్నారు.
ఇలాంటి దారుణ పరిస్థితుల్లోనూ పక్షపాతం చూపించడంపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెత్తు మాట కూడా అనట్లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ ప్రాంతం నుంచి ఆయిల్, గ్యాస్ తీసుకెళ్తూ.. తమ ఊపిరి కూడా అందించరా అని ప్రశ్నిస్తున్నారు. మరి, దీనిపై ఏపీ సర్కారు కేంద్రాన్ని ప్రశ్నిస్తుందో లేదో చూడాలని అంటున్నారు.