
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి నవ్యాంధ్ర రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దని రైతులు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు వారు 125 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఇళ్లకే పరిమితమై రాజధాని ప్రాంత రైతులు, కూలీలు వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో నేత ఒకరు కరోనా నేపథ్యంలో రాజధాని తరలింపు విషయంలో ముందుకు వెళ్లవద్దని సీఎంకు సూచనలు చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో నేపధ్యంలో రాజధాని తరలింపు ఉండదని రాజధాని వాసులు భావిస్తున్న సమయంలో వైసీపీ కీలక నేత విజయసాయి విశాఖపట్నంలో రాజధాని తరలింపుపై ప్రకటన చేశారు.
విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుందని, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని స్పష్టం చేశారు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. మంగళవారం విశాఖలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. కన్నా వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. కాణిపాకమే కాదు.. వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానాని చెప్పారు. అవినీతికి పాల్పడలేదని కన్నా, సుజనా చౌదరి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.
సుజనాచౌదరి బోగస్ కంపెనీలు సృష్టించి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ ఓ అవినీతిపరుడని, రూ.20 కోట్లకు అమ్ముడుపోయారనే విషయాన్నీ తాను మరోమారు స్పష్టం చేస్తున్నానని చెప్పారు. కన్నా లాంటివాళ్లు.. ప్రశ్నించేందుకు అనర్హులు అని చెప్పారు.