Kendriya Vidyalaya: కేంద్రంలోని మోడీ సర్కార్ సంస్కరణల బాటపట్టింది. పైరవీలకు తావులేని కొత్త వ్యవస్థను తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధుల కోటాలు తగ్గిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా ఎత్తివేస్తూ నిర్ణయం వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపల్స్ కు ఆదేశాలు అందాయి.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎంపీలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్నారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం.. గత ఏడేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. గత ఏడేళ్లలో 1.7 లక్షల మంది కంటే తక్కువమంది ఎప్పుడూ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ పొందలేదు. ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కేవీల్లో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇన్నాళ్లు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతి సంవత్సరం ప్రతి ఎంపీ 10 మంది విద్యార్థులను సిఫార్సు చేసే అధికారం ఉండేది. సదురు విద్యార్థులు సంబంధిత ఎంపీ నియోజకవర్గంలో ఉండి తీరాలన్న నిబంధన ఉండేది. తమ నియోజకవర్గంలో కేవీలు లేనట్లయితే పక్కనే ఉన్న నియోజకవర్గంలో కేవీలకు సిఫార్సు చేసే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.
లోక్ సభ ఎంపీలకే కాదు.. రాజ్యసభ ఎంపీలకు కూడా సిఫార్సు చేసే అధికారం ఉంది. ఎంపీ కోటాను రద్దు చేయాలని వచ్చిన సిఫార్సుల ఆధారంగా కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కేంద్రీయ విద్యాలయాల్లో ఇక అడ్మిషన్లు ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి.
దేశంలో మొత్తం 1245 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. యూపీలో 104, మధ్యప్రదేశ్ లో 95, రాజస్థాన్ లో 68 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. లడఖ్ లో మినహా అన్ని చోట్ల కేవీలుఉన్నాయి. లఢఖ్ లో మినహా అన్ని చోట్ల కేంద్రీయ విద్యాలయాలున్నాయి. రాజధాని ఢిల్లీలో 41 కేవీలు ఉన్నాయి. వీటన్నింటిలో ఎంపీలకు తలా 10 సీట్లు దక్కేవి. ఇప్పుడు వారికి ఈ సీట్లు లేకుండా చేసి తల్లిదండ్రులకు, ఎంపీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.