Munugode By Election 2022: తెలంగాణలో.. కాదు కాదు.. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మునుగోడు చరిత్ర సృష్టిస్తోంది. అక్కడ జరుగుతున్న పాలిటిక్స్ చూస్తుంటే.. ప్రజాస్వామిక వాదులు అసహ్యించుకుంటున్నారు. డబ్బు, మద్యం నియోజకవర్గంలో ఏరులై పారుతోందని పత్రికలు, టీవీ చానెళ్లు, సోషల్ మీడియా కోడై కూస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రజలు చైతన్యవంతం కాకపోతే మునుగోడులో మూడు ప్రధాన పార్టీల్లో ఎవరో ఒక అభ్యర్థి గెలుస్తాడు కావొచ్చు కానీ ప్రజలు, ప్రజాస్వామ్యం మాత్రం ఓడిపోవడం ఖాయం.

చైన్ లింక్ రాజకీయాలు..
మనుగోడులు చైన్ లింక్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రానికి డబ్బులు తీసుకుని మరో పార్టీలోకి వెళ్తున్నాడు. సాయంత్రం ఆపార్టీలో ఉన్న నేతలు.. మరుసటి రోజు ఉదయానికి ఇంకో పార్టీలో కనిపిస్తున్నారు. బిజినెస్‌లో మార్కెటింగ్ ఎక్కువ చేస్తే అంత ఇన్‌సెంటివ్ ఇస్తున్నాయి వ్యాపార సంస్థలు. ఇప్పుడు మునుగోడులో రాజకీయా పార్టీలు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. పార్టీల్లో ముఖ్యమైన నేతలుగా, సంఘం అధ్యక్షులుగా ఉన్నవారు.. తమ వెంట పదిమందిని తీసుకువస్తే వారికి ఇన్‌సెంటివ్ ఎక్కువ ఇస్తున్నారు. దీంతో నేతలు తమ వెంట వీలైనంత ఎక్కువ మందిని తీసుకెళ్తున్నారు.
పార్టీ మారని వాళ్లలో ఆందోళన..
పార్టీలు మారేవారు మునుగోడు ఎన్నికలే అదునుగా డబ్బులు సంపాదించుకుంటుంటే నిజమైన కార్యకర్తలకు మాత్రం ఏమీ మిగలడం లేదట. మూడు ప్రధాన పార్టీల్లో పార్టీ కోసం కష్టపడే క్యాడర్ ఉంది. వీరు ఒక పార్టీలోని వారిని తమ పార్టీలోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. కానీ, పార్టీ మారిన వారికి తాయిళాలు అందుతుంటే తీసుకొచ్చిన వారికి, నిబద్ధతతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న వారికి మాత్రం అభ్యర్థులు మొండిచేయి చూపుతున్నారు. దీంతో పార్టీకి కట్టుబడి నష్టపోతున్నామన్న ఆవేదనలో నిజమైన క్యాడర్ ఉంది.
ఏడాది మధ్యం.. నెల రోజుల్లో అమ్మకం..
మునుగోడులో మద్యం కూడా ఏరులై పారుతోంది. ఎన్నిక ప్రచారంలో భాగంగగా తాగుడు అలవాటు లేనివారికి కూడా ప్రధాన పార్టీలు తాగుబోతులుగా మారుస్తున్నాయి. ఇష్టానుసారంగా మద్యం పంపిణీ చేస్తున్నాయి. తాగినోళ్లకు తాగినంత మందు దొరుకుతుంటే.. తాగనోళ్లకు కూడా వద్దన్నా మద్యం అందుతోంది. ఉచితంగా ఇస్తున్న మందును ఎందుకు కాదనాలని తాగని వాళ్లు కూడా మద్యం తీసుకుంటున్నారు. దీంతో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమ్మకాలను చూస్తుంటే.. మునుగోడులో ఏడాది మొత్తంలో అమ్మే మద్యం ఈ నెల రోజుల్లోనే అమ్ముడయ్యే అవకాశం కనిపిస్తోంది.
హుజూరాబాద్ రికార్డు బద్దలు..
తెలంగాణలో ఇప్పటి వరకు ఖరీదైన ఎన్నికలుగా హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడును చూస్తుంటే.. హుజూరాబాద్ రికార్డు బద్ధలు కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కొంతమందైతే ఇప్పటికే హుజూరాబాద్ రికార్డు చెరిగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం పంపిణీలోకానీ, నేతల కొనుగోలులో కానీ, పార్టీల మార్పు విషయంలో కానీ ఇలా ఏ విషయం చూసుకున్నా.. డబ్బులు నీళ్లలా పార్టీలు ఖర్చు చేస్తున్నాయని అంటున్నారు. ఇవే డబ్బులను ఉప ఎన్నిక తీసుకురాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుచేసి ఉంటే.. నియోజకవర్గం మరో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అయ్యేదని ఇంకొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పండుగ చేసుకుంటున్న ఓటర్లు..
ఇక రాజకీక పార్టీలు ఇస్తున్న తాయిళాలతో మునుగోడు ఓటర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. పక్క నియోజకవర్గాల ఓటర్లు కూడా తాము మునుగోడు ఓటర్లం అయి ఉంటే బాగుండు అన్నట్లుగా ఓటర్లకు తాయిలాలు అందుతున్నాయి. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే.. తులం బంగారం ఇస్తామని కూడా పార్టీలు చెబుతున్నాయి. ఎన్నికలు సమీపించే నాటికి ఈ తాయిళాలు ఇంకా పెరుచొచ్చన్న అభిప్రాయం కూడా ఉంది.
ఏది ఏమైనా పరిస్థితి చూస్తుంటే.. మునుగోడులో మూడు పార్టీల అభ్యర్థుల్లో ఓవరో ఒకరు గెలవడం ఖాయం. కానీ అత్యంత ఖరీదైన ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, ప్రజలతోపాటు ఎన్నికల సంఘానికి మాత్రం ఓటమి తప్పదు.