YCP Politics: అంతులేని విజయం.. విపక్షానికి అందనంత దూరం. దేశంలో కనీవినీ ఎరుగని గెలుపును సొంతం చేసుకుంది జగన్ నేత్రుత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. గత మూడేళ్లలో ఎటువంటి ఎన్నికైనా అలవోక విజయంతో పట్టు నిలుపుకుంది. అసలు అసమ్మతి అనే మాట వినిపించేది కాదు. ఒక వేళ నేతల్లో ఉన్నా బయటపడేది కాదు. కనీసం సీఎం జగన్ కు ఎదురుచెప్పే నేత లేరు. తండ్రి రాజశేఖర్ రెడ్డితో పనిచేసిన సహచరులు కూడా జీహుజూర్ అనవాల్సిందే. ఎంతటి సీనియర్ నాయకులకైనా ఆయన మాటే శాసనం.
అయితే ఇదంతా నిన్నటి వరకూ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో అంతా సీన్ మారిపోయింది. అధినేత జగన్ అంటే భయం పోయినట్టు కనిపిస్తోంది. రోజురోజుకూ శ్రుతిమించుతోంది. అధికార, వైసీపీ యంత్రాంగంపై సీఎం జగన్ పట్టు సడలుతున్నట్టుంది. తన మాటే వేదమని, అందరూ వినాల్సిందేనన్న వైఖరి క్రమంగా కనుమరుగవుతున్నట్టు కనిపిస్తోంది.
Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి చాప్టర్ క్లోజ్… ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తొలగింపు
ఇప్పటివరకూ పార్టీలో ఉన్న క్రమశిక్షణ కట్టు దాటినట్టు కనిపిస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నాడు పాదయాత్రతో పాటు ఎన్నికల ప్రచారంలో మా అక్క గెలిస్తే మంత్రి, మా అన్న గెలిస్తే మంత్రి అంటూ జిల్లాలకు వెళ్లి హామీ ఇచ్చేశారు. అటువంటి వారు తొలి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ నిరాశే ఎదురైన విస్తరణలోనైనా అవకాశమిస్తారని సర్ధుకున్నారు.
తొలుత 90 శాతం మంది మంత్రులను తీసేసి.. కొత్తవారికి చోటిస్తానని ఇస్తామని లీకులిచ్చారు. సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడం, హెచ్చరికలు, అలకపాన్పులు ఎక్కడంతో 11 మందిని కొనసాగించారు. కానీ సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకతోటి సుచరితలకు కొనసాగింపు దక్కకపోవడం పెద్ద దుమారమే రేగింది. వారు జగన్ తీరుపై అసంత్రుప్తితో రగిలిపోతున్నారు. మలివిడత విస్తరణలో కచ్చితంగా అవకాశమిస్తానని చెప్పిన సీఎం మాట తప్పారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, కరణం ధర్మశ్రీ , గొల్ల బాబూరావు రోడ్డెక్కారు. బాబూరావు వందల మంది కార్యకర్తలతో తాడేపల్లి తరలివచ్చి.. ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోనే నిరసన సమావేశం ఏర్పాటుచేశారు. కానీ సీఎం జగన్ ఏం చేయలేని నిస్సహాయతలో ఉండిపోయారు.
పోటా పోటీగా సభలు
పునర్వ్యవస్థీకరణలో మంత్రులైనవారు అభినందన సభల పేరుతో.. పదవులు కోల్పోయిన వారూ ఆత్మీయ సభల పేరిట జిల్లాల్లో బలప్రదర్శనకు దిగుతున్నా.. జగన్ నిలువరించలేకపోతున్నారన్న అభిప్రాయం అధికారపక్షంలో వ్యక్తమవుతోంది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ముదురుపాకాన పడింది. ఆదివారం ఒకే సమయంలో వీరు సభలు పెట్టడంతో పార్టీ పరువు బజారునపడిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలతో అధిష్టాన పెద్దలు మాట్లాడారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగితే జగన్ జోక్యం చేసుకునేవారు. కాస్తా కటువుగానే చెప్పేవారు. కానీ ఎందుకో ఇప్పడు ఉదాసీనత వైపు అడుగులేస్తున్నారు. జంకుతున్నట్లు కనిపిస్తోందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మంత్రులుగా ఉన్న సమయంలో చెలరేగి మాట్లాడిన కొందరు నేతలు.. పదవులు పోయాక మౌనం దాల్చారు. గతంలో జగన్‌ను విమర్శిస్తే.. గయ్యిన లేచిన వీరు ఇప్పుడు నోరెత్తడం లేదు.
పక్క పార్టీల్లోకి వలసలు
జిల్లాల్లో నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. ముదిరిపాకాన పడుతున్నాయి. చాలామంది నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. 2023 అక్టోబరు తరువాత ఆ పార్టీల్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. అప్పటివరకూ అధికార పార్టీలో ఎలాగోలా సర్దుబాటుతో గడపాలనుకుంటున్నారు. ప్రస్తుతం దిగువ శ్రేణి నాయకత్వంలో కూడా పట్టు సడలుతోంది. గ్రామాల్లో ఎటువంటి అభివ్రుద్ధి లేకపోవడం, ఉన్న నిధులను ప్రభుత్వం మళ్లించడంతో ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. దీంతో వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరికలు భారీగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఏడాది తరువాత వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
Also Read:Pranhita River: పుష్కరాలు: ప్రాణహితకు మిలియన్ల సంవత్సరాల చరిత్ర.. ఇవిగో ఆనవాళ్లు..