
ఏపీ వ్యాప్తంగా కరోనా ప్రబలుతోంది. మొన్నటి వరకు అస్సలు ఉనికే లేని శ్రీకాకుళంలో కూడా ముగ్గురికి సోకింది. కానీ ఆరంభంలో విశాఖపట్నంలో అధికంగా కేసులు నమోదై ఇప్పుడు వ్యాప్తియే లేకుండా పోయింది. ఏంటీ మతలబు అన్నది అంతుచిక్కని విధంగా ఉంది. దీనివెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది.
*విశాఖల్లో కేసుల్లేవ్.. మతలబు ఏంటి?
గడిచిన వారం పదిరోజులుగా విశాఖలో కొత్త కేసులు లేనే లేవు. పైనున్న శ్రీకాకుళంలో వెలుగుచూసినా విశాఖలో అస్సలు కరోనా వ్యాప్తియే లేదు. ఆరంభంలో చాలా ఎక్కువగా నమోదైన కేసులు తర్వాత ఇంత వేగంగా సున్నాకు పడిపోతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
*కొత్త రాజధానిలో దాచేస్తున్నారా?
ఏపీ కొత్త రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖ పట్నంకు వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దాని ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నంలో ఆరంభంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కొద్దిరోజులుగా విశాఖ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఒక్కసారిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా బాధితులను ప్రభుత్వం దాస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తూ అక్కడ కేసుల సంఖ్య కొద్దిరోజులుగా ఒక్కటి నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
*విశాఖలో సున్నా కేసులు
ప్రభుత్వం విడుదల చేసిన తాజాగా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఆ జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. అందులో కేవలం మూడు మాత్రమే యాక్టివ్ కేసులులున్నాయి. 19మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్యయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ఇంత ప్రబలంగా ఆరంభంలోనే కరోనా విస్తరించి ఇప్పుడు సున్నాకు పరిమితం కావడం అన్ని వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరిగి విశాఖలో మాత్రం తగ్గుదల అందరిలోనూ అనుమానాలకు కారణం అవుతోంది. గడిచిన వారం రోజులుగా అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రెడ్ జోన్ల సంఖ్య కూడా ఇక్కడ నామమాత్రంగా ఉంది. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.
* రాజధాని కోసమేనంటూ ప్రచారం..
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో ప్రతీరోజు కనీస సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా విశాఖలో మాత్రం వారంరోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు కరోనా కేసులను దాచిపెట్టి ప్రభుత్వం రాజధాని తరలింపునకు రంగం సిద్ధం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కరోనా కేసుల సంఖ్య లేకపోవడం అనుమానాలకు కారణమవుతోంది. అయితే అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.
*అనుమానితులున్నా.. కేసులు సున్నా..
నిజానికి విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ కొద్దిరోజులుగా అక్కడక్కడా అనుమానితులను గుర్తిస్తున్నారు. వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. వారి నమూనాలను పరీక్షలకు పంపుతున్నారు. అయితే పాజిటివ్ రావడం లేదని తెలుపుతున్నారు. విశాఖ సరిహద్దుల్లో కేసులు లేని శ్రీకాకుళం, విజయనగరం ఉండడం.. సరిహద్దు ఒడిషాలో అసలే కేసులు లేకపోవడం.. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడడం కేసులు లేకపోవడానికి కారణమంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం రాజధాని కోసమే కేసుల సంఖ్యను దాచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
-నరేశ్ ఎన్నం