Homeజాతీయ వార్తలుPM Modi Speech In Parliament: అవిశ్వాస ‘కాంగ్రెస్’.. అనర్గళ మోడీ..

PM Modi Speech In Parliament: అవిశ్వాస ‘కాంగ్రెస్’.. అనర్గళ మోడీ..

PM Modi Speech In Parliament: మణిపూర్ లో జరుగుతున్న హింస, పుల్వామా దాడి జరిగినప్పుడు జమ్ము కాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు, సరిహద్దుల్లో పెరుగుతున్న చైనా దురాఘతాలను నిరసిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. గురువారం లోక్ సభ లో వాడి వేడిగా చర్చ జరిగింది. అంతకు ముందు అవిశ్వాస తీర్మానంపై పాలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు సభలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశించారు. సుమారు రెండు గంటలకు పైగా ఆయన ప్రసంగించారు. ఎప్పటిలాగే ఆయన ప్రతిపక్షాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని మాట్లాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నేత అధిర్ పై స్పీకర్ సస్పెన్షన్ వేటు విధించారు. అంతకుముందు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దృతరాష్ట్రుడు, నీరవ్ మోడీతో పోల్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తప్పు పట్టింది. ఆ వ్యాఖ్యలను స్పీకర్ తొలగించారు. తర్వాత అతడిని సస్పెండ్ చేశారు. ఇక సభలో మాట్లాడేందుకు రెండు గంటలకు పైచిలుకు సమయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మణిపూర్ విషయంలో మాత్రం కేవలం పదంటే పదినిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఆ పది నిమిషాల సమయం లోనూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కనపెట్టి గత కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ ఫోటో ఎందుకు పెట్టనివ్వలేదని, జాతీయ గీతం ఎందుకు ఆలపించనివ్వలేదని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల్లో హింస ఈ స్థాయిలో పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. “లంకను దురంకారంతోనే ఆంజనేయుడు కాల్చేశాడు అని రాహుల్ గాంధీ అంటున్నారు. నిజమే అందుకే ఈ దేశంలో ప్రజలు రాముడితో ఉన్నారు.. వారు కాంగ్రెస్ ను కాల్చి కేవలం 40 సీట్లకు పరిమితం చేశారు” అని రాహుల్ గాంధీకి సరైన రీతిలో మోడీ సమాధానం చెప్పారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమిలో ఉన్న విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో మూజువాణి ఓటు ద్వారా సభ అవిశ్వాసాన్ని తిరస్కరించింది.

ఇక సభలో మాట్లాడుతున్నంత సేపు నరేంద్ర మోడీ ప్రతిపక్షాల మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తారు. “యూపీఏ కు అంత్యక్రియలు చేసే ఇండియాగా నామకరణం చేశారు. అది ఇండియా కూటమి కాదు అహంకారుల కూటమి. చేతులు కలుపుతారు ఆపై కత్తులతో పొడుచుకుంటారు. అహంకారంతోనే కాంగ్రెస్ 400 నుంచి 40 సీట్లకు పరిమితమైంది. అవిశ్వాసం పెడుతూనే ఉంటారు.. అది విరిగిపోతూనే ఉంటుంది. మణిపూర్ రాష్ట్రంలో శాంతి తథ్యం. వారికి అండగా దేశం ఉంటుంది” అని మోడీ ప్రతిపక్షాలకు తిరుగులేని స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలించినప్పుడు దేశం 12వ ఆర్థిక శక్తిగా ఉందని, బిజెపి పాలనలో అది ఐదవ స్థానానికి చేరుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ మేమే గెలుస్తామని, అప్పుడు భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. అప్పుడు కూడా వారు అవిశ్వాసం పెడతారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదేవిధంగా అనుసరించిందని, ఇకముందు కూడా అదే దారిని అనుసరిస్తుందని ఆయన వివరించారు.”అవిశ్వాస తీర్మానంపై మీరేం చర్చించారు? మీ మద్దతుదారులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదీ మీ పరిస్థితి. విశేషం ఏంటంటే మీరు ఫీల్డింగ్ చేస్తుంటే మేము ఫోర్లు, సిక్స్ లు కొట్టాం. మేము సెంచరీలు చేస్తుంటే.. మీరు నో బాల్స్ వేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని మీరే ప్రవేశపెట్టారు. మరి ముందస్తుగా సిద్ధమై ఎందుకు రాలేదు” అని మోడీ ప్రశ్నించారు. 2018లోనూ తనపై అవిశ్వాసం పెట్టి విఫలమయ్యారని, అప్పట్లో వారికి కనీసం ఉన్న ఓట్లు కూడా రాలేదని, ఆ తర్వాత ఎన్నికల్లో తాము మాత్రం ఘనవిజయం సాధించామని గుర్తు చేశారు. 2018 లో తాను వారికి ఐదు సంవత్సరాల సమయం ఇచ్చానని, అవిశ్వాస తీర్మానంపై చర్చకు వాళ్ళు సరైన హోంవర్క్ చేసుకు రాలేదని, ఇప్పుడు కూడా 2028 వరకు టైం ఇస్తున్నానని మోడీ అన్నారు.

Rocky
Rockyhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular