టీఆర్ఎస్ లో.. ఈట‌ల‌ను ఢీకొనే వారే లేరా?

హుజూరాబాద్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టీఆర్ఎస్ ను ఓడించి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు ఈట‌ల‌. అటు గులాబీద‌ళం సైతం.. రాజేంద‌ర్ ను చిత్తుచేసి టీఆర్ఎస్ కు తిరుగులేద‌ని చాటుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ల‌క్ష్యం బాగానే ఉందిగానీ.. పోటీదారుడే ‘స‌రైనోడు’ లేన‌ట్టుంది. టీఆర్ఎస్ లో జ‌రుగుతున్న ప్ర‌చారం ఇదే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. ఈట‌ల‌ను ఎదుర్కొనే ధీటైన అభ్య‌ర్థి దొర‌క్క‌.. గులాబీ అధినేత మ‌ద‌న‌ప‌డుతున్నారా? అనే సందేహం కూడా వ్య‌క్త‌వుతోంది. ఈట‌ల బ‌య‌ట‌కు వెళ్లి పోయిన త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌ల్లో […]

Written By: Bhaskar, Updated On : July 13, 2021 12:56 pm
Follow us on

హుజూరాబాద్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టీఆర్ఎస్ ను ఓడించి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు ఈట‌ల‌. అటు గులాబీద‌ళం సైతం.. రాజేంద‌ర్ ను చిత్తుచేసి టీఆర్ఎస్ కు తిరుగులేద‌ని చాటుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. ల‌క్ష్యం బాగానే ఉందిగానీ.. పోటీదారుడే ‘స‌రైనోడు’ లేన‌ట్టుంది. టీఆర్ఎస్ లో జ‌రుగుతున్న ప్ర‌చారం ఇదే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. ఈట‌ల‌ను ఎదుర్కొనే ధీటైన అభ్య‌ర్థి దొర‌క్క‌.. గులాబీ అధినేత మ‌ద‌న‌ప‌డుతున్నారా? అనే సందేహం కూడా వ్య‌క్త‌వుతోంది.

ఈట‌ల బ‌య‌ట‌కు వెళ్లి పోయిన త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా.. బీజేపీ నేత‌ ఇనుగాల పెద్దిరెడ్డి పేరు వినిపించింది. బీజేపీలోకి ఈట‌ల రాక‌ను ఈయ‌న నేరుగానే వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఈయ‌న గులాబీ గూటికి చేరి, ఈట‌ల‌పై పోటీ చేస్తార‌నే ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత ఆయ‌న సైలెంట్ అయ్యారు. ఆ వెంట‌నే కౌశిక్ రెడ్డి పేరు వినిపించింది. ఈట‌ల భూ క‌బ్జాలు అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ కౌశిక్ హ‌డావిడి చేయ‌డంతో.. అప్పుడే క‌న్పామ్ అన్నారు. ఆ త‌ర్వాత టీడీపీ నేత ముద్ద‌సారి దామోద‌ర్ రెడ్డి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకొని టికెట్ అన్న ప్ర‌చారం చేశారు.

తాజాగా.. టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఎల్‌. ర‌మ‌ణ‌ను కారెక్కించుకొని, ఆయ‌న‌కే హుజూరాబాద్ టికెట్ అని కూడా ప్ర‌చారం చేశారు. ఈ ప్ర‌చారం సాగుతుండ‌గానే.. కౌశిక్ రెడ్డి ఆడియో టేపు లీకై.. ర‌చ్చ జ‌రిగింది. ఆయ‌న కాంగ్రెస్ కు రాజీనామా కూడా చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కౌశిక్ రెడ్డికి గులాబీ టికెట్ ఇస్తారా? అనేది చూడాలి. మొత్తానికి.. ఈ ప‌రిణామాల ద్వారా గులాబీ ద‌ళంలో ఈట‌ల‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి లేడ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందా? అనే సందేహ‌మైతే క‌లుగుతోంది.

ఈట‌ల ఒక‌టీ రెండు కాదు.. దాదాపు 20 ఏళ్లుగా హుజూరాబాద్ లో పాతుకుపోయారు. గెలిచి ఎమ్మెల్యేగా త‌న ప‌ని తాను చేసుకుపోకుండా.. అంద‌రి త‌ల‌లో నాలుక‌లా ఉన్నారు. త‌న వ‌ర్గాన్ని పెంచుకున్నారు. ఆయ‌న్ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన‌ప్పుడు.. దాదాపు 90 శాతం ప్ర‌జాప్ర‌తినిధులు ఈట‌ల వెంటే నిల‌బ‌డ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. అలాంటి ఈట‌ల‌ను ఢీకొట్ట‌డానికి టీఆర్ఎస్ లో స‌రైన అభ్య‌ర్థి లేక‌నే.. ఇత‌ర పార్టీల్లోని నేత‌ల‌కు గాలం వేస్తున్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది. మ‌రి, ఈ ప‌రిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటార‌న్న‌ది చూడాలి.