Covid Vaccines: కొత్త పరిశోధన : కరోనా టీకాకు.. గుండెపోటు ముప్పుకు సంబంధంపై తేల్చేశారు

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు.

Written By: Raj Shekar, Updated On : September 5, 2023 4:25 pm

Covid Vaccines

Follow us on

Covid Vaccines: భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత దేశంలో గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ గుండెపోటు కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్లు చాలా సురక్షితమైనవేనని అధ్యయనం తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

వ్యాక్సిన్లు సురక్షితం..
‘భారత్‌లో వ్యాక్సిన్లు సురక్షితమని మా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించాం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన జీబీ.పంత్‌ ఆస్పత్రికి చెందిన మోహిత్‌ గుప్తా వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఏఎంఐ బాధితుల్లో.. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. అయితే, ఇది ఒకే కేంద్రంలో జరిపిన అధ్యయనమని.. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

గుండె పోటుతో సంబంధం లేదు..
ఇక గుండెపోటు తర్వాత బాధితుల మరణానికి సంబంధించి వ్యాక్సిన్‌ ప్రభావం ఏమైనా ఉందా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గతేడాది మన దేశంలోనే ఓ అధ్యయనం జరిగింది. ఇందుకోసం ఢిల్లీలోని జీబీ.పంత్‌ ఆస్పత్రిలో ఆగస్టు 2021–ఆగస్టు 22 మధ్య కాలంలో చేరిన 1,578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1,086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోనివారే. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4 శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు. వీరిలో గుండెపోటు మరణాలు లేవని అధ్యయనంలో తేలింది. తద్వారా గుండె పోటుకు వ్యాక్సిన్‌ కారణం కాదని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు నిర్ధారణకు వచ్చారు.

దీంతో ప్రజల్లో ఉన్న భయం కాస్త తీరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సడెన్‌ స్ట్రోక్‌తో ఇటీవల చాలా మంది మరణిస్తున్నారు. ఇందులో వయసుతో సబంధం లేకుండా గుండె పోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కారణం కావొచ్చన్న ప్రచారం జరగుతోంది. వైద్యులు కూడా కాదని చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యం తాజా అధ్యయన ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయి. అయితే గుండెపోటుకు కారణాలపై కూడా అధ్యయనం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.