ఒక సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్ లో వాళ్లు అతిపెద్ద నాయకులు.. కీరోల్ పోషించే కీలక పాత్రధారులు.. ఆ జిల్లా రాజకీయాలనే కాదు.. ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఆ జిల్లాలోనే ఉండడం లేదు.. కనీసం జిల్లా ప్రజలను పలకరించడం లేదు. హైదరాబాద్ కే పరిమితమై జిల్లాను వదిలేశారు.
నిజామాబాద్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఇప్పుడు దాదాపు ఆ జిల్లా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉమ్మడి నిజామాబాద్ వ్యవహారాల్లో ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. వారే నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.
Also Read: కాంగ్రెస్ కు షాకిచ్చిన పెద్దాయన..!
వైఎస్ఆర్ ప్రోద్బలంతో ఎన్ఆర్ఐగా.. ప్రముఖ లాయర్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ నిజామాబాద్ ఎంపీగా వరుసగా రెండు సార్లు పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్ హయాంలో అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతూ జాతీయ స్థాయి నేతగా మారారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చేతిలో ఓడిపోయాక మధుయాష్కీ కాస్త తగ్గాడు. ఇక 2019 ఎన్నికల్లో ఏకంగా నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నేత ధర్మపురి అరవింద్ గెలవడం.. నిజామాబాద్ లో 3వ స్థానానికి పరిమితం కావడంతో మధుయాష్కీ ఇక నిజామాబాద్ పై ఆశలు వదిలేశాడు. అప్పటి నుంచి నిజామాబాద్ రాజకీయాలకు దూరంగా జరిగాడు. జిల్లా సందర్శనలు అస్సలే ఉండడం లేవు.
ఇక షబ్బీర్ అలీ కాంగ్రెస్ పీసీసీ రేసులో కూడా నిలిచినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కామారెడ్డి ప్రజల మదిని మాత్రం దోచుకోవడం లేదు. ఎన్నిసార్లు పోటీచేసినా టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించలేకపోవడంతో ఇక నిజామాబాద్ జిల్లాకు వెళ్లడమే మానేశాడు.ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ రాజకీయాలను వదిలేసి తన వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడని తెలిసింది.
Also Read: కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?
ఇలా ఒకప్పుడు నిజామాబాద్ ను ఏలిన ఇద్దరు నేతలు ఇప్పుడు కాలక్రమేణ రాజకీయాల్లో కనుమరుగు కావడం నిజంగా విధి వైచిత్యమే.