మోదీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ఝలక్!

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. లాక్‌డౌన్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తో పన్నులు వసూలు కానందున ఏడాది పాటు 66 కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్రం వాటాను కూడా కేంద్రమే చెల్లించాలని కోరారు. ఈ ఏప్రిల్‌లో సొంత వనరుల నుండి రాష్ట్ర […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 3:50 pm
Follow us on


కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. లాక్‌డౌన్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌తో పన్నులు వసూలు కానందున ఏడాది పాటు 66 కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్రం వాటాను కూడా కేంద్రమే చెల్లించాలని కోరారు. ఈ ఏప్రిల్‌లో సొంత వనరుల నుండి రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పన్నులు 85 శాతం నిలిచిపోయాయని పేర్కొన్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో 66 కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా రూ.10,000 కోట్లు ఖర్చు చేశామని, కానీ లాక్‌డౌన్‌ కొనసాగింపు దృష్ట్యా..రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు దారుణంగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఆ ఖర్చు భరించే పరిస్థితి లేదని బిజెపి నేత అయినా ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ వెల్లడించారు.

కేంద్ర డబ్బులు ఇవ్వకపోతే మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, మధ్యాహ్న భోజన పథకం, ఇతర ముఖ్యమైన పథకాల అమలును నిలిపేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇప్పటికే కేరళ, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రభుత్వాలు ఆదాయ వనరులు కోల్పోయిన రాష్ట్రాలను కేంద్రమే ఆదుకోవాలని కోరుతూ ఉండడం గమనార్హం. పైగా రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూర్చే విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండడం పట్ల కొందరు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.