Nirmala Sitaraman : రాజ్యసభలో నిర్మల తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇటీవల తమకు అప్పులు తీసుకునే వెసలు బాటును మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కీలక ప్రతిపాదనలు కూడా పంపింది. ఆయనప్పటికీ కేంద్రం వాటిని తిరస్కరించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అనేక ప్రతిపాదనలు పంపించింది. స్కిల్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేయాలని.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని.. ఇంకా అనేక రకాల వరాలు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. కేంద్రానికి సమకూరుతున్న జిఎస్టిలో తెలంగాణ వాటా అధికంగా ఉందని.. కేంద్రం వెల్లడిస్తున్న జీఎస్టీ వసూళ్ల లెక్కలే ఇందుకు నిదర్శనం గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన పంపిన ప్రతిపాదన లేఖల్లో ప్రస్తావించింది. అయినప్పటికీ కేంద్రం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి వరాలు ఇవ్వలేదు. పైగా ఇండియా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. త్వరలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించి.. ఆ రాష్ట్రంపై భారీగా వరాలు కురిపించింది.
కేంద్రం తీరుపై కాంగ్రెస్ మండిపాటు
బడ్జెట్లో తెలంగాణ పంపిన ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం తమ రాష్ట్రంపై కక్ష కట్టిందని ఆరోపించారు.. బీహార్, ఆంధ్రప్రదేశ్ కు చేసినట్టుగా తెలంగాణకు కూడా కేటాయింపులు జరపాలని కోరారు. అయితే బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం కోరినట్టుగా కేటాయింపులు జరపకపోగా.. తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప అయిందని.. ఒకప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ఇలా మారిపోయిందని కేంద్రమంత్రి రాజ్యసభలో పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పరిపాలనలో దేశంలో ఉన్న అప్పులు ఎన్ని? బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎన్ని? చర్చకు సిద్ధమా? అంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తాము అడ్డగోలుగా అప్పులు తేవడం లేదని.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు కడుతున్నామని.. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతున్నామని చెబుతున్నారు. రాజకీయ కక్షతోనే కేంద్రమంత్రి తెలంగాణ ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.