
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కుప్పలుకుప్పలుగా శవాలు కాలుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం లేకుండాపోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సెకండ్ వేవ్ కరోనా జెట్ స్పీడ్‌లో రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. పట్టణాలే కాదు.. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలనూ వదిలిపెట్టడం లేదు. పల్లెల్లోనూ వందలాది సంఖ్యలో కరోనా బారిన పడి ప్రజలు బాధపడుతున్నారు. హాస్పిటల్స్‌లో కనీసం బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో.. ప్రభుత్వం పాత క్వారంటైన్ సెంటర్లను ఓపెన్ చేయిస్తోంది. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పాలన యంత్రాంగాన్ని.. వైద్య రంగాన్ని అలర్ట్ చేస్తూనే ఉంది.
తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనతోపాటే చాలా మంది నేతలు కరోనా బారిన పడి క్వారంటైన్‌లో ఉండిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. రాష్ట్రం మొత్తం రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ నడుస్తుండగా.. ఢిల్లీలో అయితే ఏకంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కర్ఫ్యూ పెట్టడం విశేషం. ఈ రోజు నుంచి మే 1వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉండబోతున్నాయి. కేవలం అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియాకు మాత్రమే ఇందులో మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూ అమలు ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగూతనే ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 18 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,856కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 793 మంది వైరస్ బారిన పడినట్లు తెలిపారు.