తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదం రేగుతోంది. స్టే ఉన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు చేసినట్లుగా తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించడం వివాదాలకు కారణమవుతోంది. మరోవైపు చర్చలకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. దీంతో తెలంగాణ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ మంత్రులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో నేడో రేపో కృష్ణాబోర్డు సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించనుంది. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి కేఆర్ఎంబీ బృందాన్ని కేంద్ర బలగాల రక్షణతో పంపుతున్నామని చెప్పారు.
ఏపీలో ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర బలగాల రక్షణకు ఎందుకన్న అభిప్రాయం చాలా మందిలో మెదులుతున్నాయి. గతంలోనే కేఆర్ఎంబీ బృందం ప్రాజెక్టును పరిశీలించాలని నిర్ణయించుకుంది.
రెండు సార్లు రాష్ర్టానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఏపీ సర్కారు సహకరించలేదు. స్వయంగా సీఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అక్కడ శాంతి భద్రతల సమస్య ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ క్రమంలో కేఆర్ఎంబీ పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. ప్రభుత్వం ప్రాజెక్టు పరిశీలనకు వ్యతిరేకం అవడంతో కేంద్ర బలగాల రక్షణతో పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణకు చెందిన కొంతమంది రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లి దృశ్యాలు చిత్రీకరించారు. అక్కడ సర్వే పనులు మాత్రమే జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై ఇప్పుడు జలవనరుల శాఖతో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ జల వనరుల వివాదాన్ని ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.