Next Gen GST Utsav: పెద్ద నోట్ల రద్దు, కరోనా పీడ దినాలు.. ఇలా అనేక సందర్భాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన అలా ప్రసంగించిన ప్రతి సందర్భంలోనూ సంచలన విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలన్నీ జాతిని జాగృతం చేసే దిశగా నడిచాయి. విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. తాజాగా నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి కూడా సంచలన విషయాలను పంచుకున్నారు.
అమెరికా హెచ్ వన్ బీ వీసాల మీద తీసుకున్న నిర్ణయం.. ఓట్ చోరీ.. నేపాల్ దేశంలో ఆందోళనలు.. ఇన్ని పరిణామల మధ్య నరేంద్ర మోడీ ఏదో ఒక కీలక విషయాన్ని వెల్లడిస్తారని.. సంచలన విషయాలను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. సంచలన విషయాలను వెల్లడించారు.. ఇటీవల కాలంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారతదేశంలో కూడా నేపాల్ మాదిరిగానే జెడ్ జనరేషన్ ఉద్యమం వస్తుందని వ్యాఖ్యానించారు . ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఏ క్షణమైనా సరే మనదేశంలో పెను ప్రకంపనలు చోటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మాటలు ఏ రాజకీయ నాయకుడు అన్నా పెద్దగా పట్టింపు ఉండేది కాదు. రాహుల్ గాంధీ ఈమాటలు అనడంతో సాధారణంగానే చర్చ మొదలైంది. దీనిపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందించినప్పటికీ.. మోడీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోడీ ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారో అర్థం కాలేదు.. చివరికి తన మౌనాన్ని వీడిన ప్రధానమంత్రి.. ప్రతిపక్షాలకు ముఖ్యంగా రాహుల్ గాంధీకి షాక్ ఇస్తూ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో మార్పులు తీసుకొచ్చింది.. ఐదు శాతం, 18 శాతం స్లాబులు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్నింటి పైన జీరో శాతం పన్ను అనే విధానాన్ని అమలులోకి తెచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి ఇది మొదలు కాబోతోంది. దానికంటే ముందు ఒకరోజు నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి జీఎస్టీ సంస్కరణల వల్ల జరిగే మార్పులను వెల్లడించారు.. “రేపటి నుంచి దేశంలో నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్నాయి. దాంతోపాటు జీఎస్టీ బచత్ ఉత్సవం కూడా మొదలవుతుంది. రేపటి సూర్యోదయం నుంచి ఐదు శాతం, 18% జిఎస్టి స్లాబులు మాత్రమే అమల్లోకి వస్తాయి. దీంతో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. ఈ సంస్కరణ భారతదేశ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది. ఆత్మనిర్బర్ దిశగా ఇది కీలకమైన ముందడుగు. గతంలో ప్రతి చోట రకరకాల పన్నులు విధించేవారు. ప్రజలను ఇబ్బందులు పెట్టేవారు. ప్రజలను గందరగోళం నుంచి బయటపడడానికి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. వన్ నేషన్ వన్ టాక్స్ స్వప్నం సాకారం అయింది. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఈ సంస్కరణలు తోడ్పడతాయి. ఫలితంగా పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. రేపటి నుంచి నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఉత్సవం ప్రారంభమవుతుందని” నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ జనరేషన్ జెడ్ తరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వారిలో నేపాల్ తరహాలో ఉద్రేకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మాత్రం అలాంటివి చేయకుండా ఈ జనరేషన్ కు జీఎస్టీ మార్పుల వల్ల లాభం జరుగుతుందని పేర్కొన్నారు. యువత వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని.. వారి కోసం ఏమైనా చేస్తామని ప్రకటించారు. తద్వారా రాహుల్ గాంధీ ఆశలపై నీళ్లు చల్లారు నరేంద్ర మోడీ.